- సబ్సిడీ రాదని ఎగబడి ఈకేవైసీ చేసుకున్న తండా వాసులు
- మహబూబాబాద్ జిల్లాలో ఘటన
గూడూరు, వెలుగు : గ్యాస్ కనెక్షన్ కోసం ఈకేవైసీ చేస్తామని కొందరు వ్యక్తులు ప్రజల వద్ద డబ్బులు వసూలు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బందాలగడ్డ తండాలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. గ్యాస్ వినియోగదారులు తప్పని సరిగా ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారు ఈనెల 31వరకు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని, మిగతా వినియోగ దారులకు ఎలాంటి గడువు లేదని కంపెనీలు ప్రకటించాయి. ఈ విషయం తెలియని కొందరు వినియోగదారులు ఈకేవైసీ కోసం గ్యాస్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
తాము ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నుంచి వచ్చామంటూ శనివారం నలుగురు బందాలగడ్డ తండాకు వచ్చారు. అక్కడికి వెళ్లిన వినియోగదారుల వద్ద రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేశారు. ఫొటో తీస్తూ ఈకేవైసీ చేస్తున్నట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ భర్త బావ్ సింగ్ అక్కడికెళ్లారు. ఈకేవైసీ ఫ్రీగా చేయాలని, డబ్బులు ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయం వీ6 వెలుగు విలేకరికి ఫోన్ లో వారితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ నలుగురు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఈకేవైసీపై తమకు తెలిసేలా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజలు కోరుతున్నారు.