పోలీస్ శాఖలో వసూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజాలు

పోలీస్ శాఖలో వసూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజాలు
  •     ఇంట్లోకి మటన్ నుంచి జేబులోకి  రూ.లక్షల వరకు దేన్నీ వదలని ఖాకీలు
  •     ఆఫీసర్లకు ఏజెంట్లుగా కానిస్టేబుళ్లు
  •     జిల్లా పోలీస్ బాస్ నిఘా పెట్టినా ఆగని దందా
  •     కాసులు కురిపిస్తున్న భూకబ్జాలు, చోరీ కేసులు, ఇసుక ట్రాక్టర్లు

కరీంనగర్ సమీపంలోని ఓ పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని గ్రామంలో ఇటీవల ఆరు గొర్రెలు చోరీకి గురయ్యాయని ఎస్సైకి ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి సదరు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐకి ప్రతివారం ఫ్రీగా మటన్ పంపేవాడు. ఆ మటన్ తిన్న విశ్వాసంతో ఆ ఎస్సై రెచ్చిపోయాడు. సదరు వ్యాపారి చెప్పిన వ్యక్తిని గత నెల 11న తెల్లవారుజామున నిద్రలో ఉండగానే తీసుకొచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన స్టేషన్ లోనే థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. 

తాను గొర్రెలు ఎత్తుకుపోలేదని ఎంత మొత్తుకున్నా వినలేదు. ఆ తర్వాత కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ఏరియాకు తీసుకొచ్చి అక్కడ రోజంతా చితకబాదాడు. మరుసటి రోజు మళ్లీ పిలిపించగా తనకు ఒంట్లో బాగోలేదని, దెబ్బలు ఇబ్బంది పెడుతున్నాయని రోధించడంతో వదిలేశారు. మళ్లీ రెండు వారాలకు మరోసారి ఎంక్వైరీ పేరిట పిలిచి ఫిర్యాదు చేసిన మటన్ వ్యాపారి సమక్షంలోనే థర్డ్ డిగ్రీ ప్రయోగించి గొర్రెలు ఎత్తుకెళ్లింది తానేనని అంగీకార పత్రం రాయించుకున్నారు. బాధితుడు ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.

కరీంనగర్, వెలుగు:  పోలీస్ శాఖలో వసూలు రాజాలు ఎక్కువయ్యారు. అవినీతి, దందాల విషయంలో సీపీ సీరియస్ గా ఉండడం, సొంత శాఖలోని ఆఫీసర్లపైనే ఆయన నిఘా పెట్టడంతో తమ చేతికి మట్టి అంటకుండా కొందరు.. కానిస్టేబుళ్లతో వసూళ్లకు పాల్పడుతున్నారు. కొందరైతే ప్రతి సండే ఇంట్లోకి మటన్ కూడా ఫ్రీగా పార్సిల్ చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  కేసు ఏదైనా, బాధితులు ఎవరైనా రెండు వైపులా డబ్బులు బాదుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సివిల్ తగదాలపై పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు చేయడం, చిన్నాచితక దొంగతనం కేసుల్లోనూ ఎలాంటి ఆధారాల్లేకున్నా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, బాధితుల దగ్గర వసూళ్లకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. 

గుట్టుగా వసూళ్లు 

కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి భూకబ్జాలు, ఇసుక, మట్టి, ఇతర దందాల విషయంలో చాలా కఠినంగా వ్యహరిస్తున్న విషయం తెలిసిందే. కేసుల్లో ఎవరున్నా పార్టీలకతీతంగా జైలుకు పంపిస్తున్నారు. ఆయన దూకుడు చూసి కొందరు పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఎలాంటి వివాదాల్లో తలదూర్చకుండా బుద్ధిగా పని చేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం గుట్టుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. 

నేరుగా వసూళ్లకు పాల్పడితే తాము ఎక్కడ బద్నాం అవుతామో, నిఘా వర్గాల ద్వారా తమ పేరు సీపీ వరకు వెళ్తుందనే భయంతో తమ దగ్గర పనిచేసే నమ్మకమైన కానిస్టేబుళ్లతో తమ పరిధిలో దందాలకు పాల్పడే వ్యక్తుల దగ్గరి నుంచి మామూళ్లు తెప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరితోనే అనుమతుల్లేకుండా ఇసుక దందా నడిపిస్తున్న ట్రాక్టర్ల ఓనర్ల నుంచి సీఐలకు, ఎస్సైలు నెలవారీ మామూళ్లు ముడుతున్నాయి. స్టేషన్ కు వచ్చే కేసుల్లోనూ సదరు కానిస్టేబుళ్లే సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల హుజూరాబాద్ డివిజన్ లో ముగ్గురు కానిస్టేబుళ్లను ఇలాంటి ఆరోపణలతోనే  సీపీ ట్రాన్స్ ఫర్ చేశారనే ప్రచారం  ఉంది. ఏదైనా కేసులో చిక్కి పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే ఎఫ్ఐఆర్ రాసే రైటర్ నుంచి ఎస్సై, సీఐ వరకు ముడుపులు ఇవ్వనిదే పనికావడం లేదు. 

స్టేషన్ రెనోవేషన్  పేరుతో వసూళ్లు..

జిల్లాలోని ఓ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సీఐ, ఎస్సైలు ఎవరైనా ఏదైనా కేసుపై వెళ్తే మధ్యవర్తుల ద్వారా బాధితులు, ఇటు నిందితుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్ రెనోవేషన్ చేయించడానికి డబ్బులు కావాలని కేసులపై వెళ్లే లీడర్లను, ప్రజాప్రతినిధులను అడుగుతున్నట్లు తెలిసింది. డబ్బులు నేరుగా డిమాండ్ చేయకుండా, ఏసీబీకి చిక్కకుండా స్టేషన్ రెనోవేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓ సాకుగా చూపి సదరు సీఐ వాడుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లే లీడర్ల ద్వారా ల్యాండ్ లిటిగేషన్స్, ఇతర సివిల్ తగాదాలను స్టేషన్ లోనే సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.