
ముంబై: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసులు బాంద్రా కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 1000 పేజీలతో కూడిన చార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు.. ఇందులో కీలక విషయాలు ప్రస్తావించారు. షెహజాద్ అలియాస్ షరీఫుల్ ఇస్లాం అనే నిందితుడు బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో చొరబడ్డాడని.. ఈ క్రమంలోనే అడ్డుకోబోయిన సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు.
క్రైమ్ సీన్ నుంచి స్వాధీనం చేసుకున్న కత్తి మొన, సైఫ్ అలీ ఖాన్ శరీరంలోని కత్తి మొన ఒకే ఆయుధానివని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో తేలిందన్నారు. ఘటన స్థలంలో దొరికిన కత్తిపై ఉన్న వేలి ముద్రలు.. నిందితుడు ఇస్లాం ఎడమ చేతికి సరిపోలాయని పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. నిందితుడు ఇస్లాం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించాడని తెలిపారు. ముంబై రావడానికి కంటే ముందు కోల్ క తాలోని వివిధ ప్రాంతాల్లో నివసించాడని పేర్కొన్నారు.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై 2025, జవనరి 16న దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో సెలబ్రెటీలకు నిలయమైన బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీఖాన్‌పై అర్థరాత్రి గుర్తు తెలియని దుండగుడు కత్తితో ఎటాక్ చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు సైఫ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో ఖాన్‌పై కత్తిపోట్లు పడగా.. అతని ఛాతీ, వెన్నెముక, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. లీలావతి ఆసుపత్రిలో చేరిన సైఫ్.. ఐదు రోజుల పాటు చికిత్స పొంది జనవరి 21న డిశ్చార్జ్ అయ్యారు.