SL vs AUS: అసలంక వన్ మ్యాన్ షో.. కోహ్లీ రికార్డు దిగువకు

SL vs AUS: అసలంక వన్ మ్యాన్ షో.. కోహ్లీ రికార్డు దిగువకు

కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక కెప్టెన్ చరిత అసలంక(127) అద్భుతమైన సెంచరీ చేశాడు. ఒంటరి సైనికుడిలా పోరాడుతూ అజేయ శతకం సాధించాడు. 135 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న లంకకు తన సెంచరీతో ప్రాణం పోశాడు. ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు

ALSO READ | IND vs ENG: అహ్మదాబాద్‌లో దంచి కొట్టిన టీమిండియా.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం

112 బంతుల్లో వంద మార్క్ చేరుకున్న అసలంక.. మొత్తంగా 127 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. 135/8తో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అతను ఆడిన ఆట అద్భుతం. స్ట్రైక్‌ను కాపాడుకుంటూనే ఒక్కో పరుగు జోడించాడు. మొదటి నాలుగు బంతుల్లో ఒక బౌండరీ.. చివరి రెండు బంతుల్లో సింగిల్ తీస్తూ స్ట్రైక్‌ కాపాడుకుంటూ వచ్చాడు. చివరకు 214 పరుగులు చేసి జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. 

ఈ శతకంతో అసలంక పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన లంక కెప్టెన్‌గా సనత్ జయసూర్య రికార్డును బద్దలు కొట్టాడు. అదే సమయంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన నాలుగో శ్రీలంక కెప్టెన్‌గా నిలిచాడు.

కోహ్లీ రికార్డు దిగువకు.. 

ఆస్ట్రేలియాపై ఏ కెప్టెన్‌కైనా అత్యధిక స్కోరు.. భారత మాజీ దిగ్గజం ఎంఎస్ ధోని పేరిట ఉంది. మహేంద్రుడు 2013లో మొహాలీ వేదికగా జరిగిన వన్డేలో అజేయంగా 139 పరుగులు చేశాడు. అసలంక ఆ రికార్డు సమీపానికి వచ్చాడు. ఫాఫ్ డు ప్లెసిస్(125), విరాట్ కోహ్లీ(123)లను వెనక్కినెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు.

వన్డేల్లో ఆస్ట్రేలియాపై కెప్టెన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు

  • 139* (121): ఎంఎస్ ధోని (మొహాలి, 2013)
  • 136* (106): ఎబి డివిలియర్స్ (హరారే, 2014)
  • 127 (126): చరిత్ అసలంక (కొలంబో, 2025)
  • 125 (114): ఫాఫ్ డు ప్లెసిస్ (హోబర్ట్, 2018)
  • 124 (107): ఎంఎస్ ధోని (నాగ్‌పూర్, 2009)
  • 123 (95):  విరాట్ కోహ్లీ (రాంచీ, 2019)

వన్డేల్లో శ్రీలంక కెప్టెన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు

  • 189 (161): సనత్ జయసూర్య vs ఇండియా(షార్జా, 2000)
  • 139* (116): ఏంజెలో మాథ్యూస్ vs ఇండియా (రాంచీ, 2014)
  • 131* (152): అర్జున రణతుంగ vs ఇండియా (కొలంబో, 1997)
  • 127 (126): చరిత్ అసలంక vs ఆస్ట్రేలియా (కొలంబో, 2025)
  • 126* (127): మహేళ జయవర్ధనే vs ఇంగ్లండ్ (చెస్టర్-లీ-స్ట్రీట్, 2006)