- తుపాకీ 3 రౌండ్ల బులెట్లు స్వాధీనం
చర్లపల్లి, వెలుగు: ఓ ఏజెన్సీ నిర్వాహకుడి నుంచి తనకు రావాల్సిన రూ.3 లక్షల కోసం.. అతడిని చంపేందుకు స్కెచ్ వేసిన వ్యక్తిని చర్లపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ జానకి తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన యోగేందర్ రాజ్ పుత్ 2007లో ఉపాధి కోసం సిటీకి వచ్చాడు. కృష్ణానగర్‌లోని కుశాల్ లాజిస్టిక్‌లో కొన్నిరోజులు డ్రైవర్‌గా పనిచేశాడు. 2018లో వైఎస్ఆర్ఎస్ఎస్ సెక్యూరిటీ సర్వీసెస్‌ను కొండాపూర్‌లో స్థాపించాడు. తర్వాత ఆఫీసును బోరబండకు మార్చాడు. ఈ క్రమంలో మౌలాలికి చెందిన షరీఫ్‌తో అతడికి పరిచయం ఏర్పడింది.
షరీఫ్ ఈసీఐఎల్‌లో ఈప్రో మ్యాన్ పవర్ ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. గతేడాది 25 మంది సెక్యూరిటీ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో యోగేందర్కు చెందిన ఏజెన్సీ నుంచి తీసుకున్నాడు. నెలరోజుల తర్వాత యోగేందర్ ఏజెన్సీతో ఉన్న కాంట్రాక్ట్‌ను షరీఫ్ రద్దు చేసుకున్నాడు. అయితే, అతడికి ఇవ్వాల్సిన రూ.3 లక్షలను షరీఫ్ చెల్లించలేదు. దీంతో షరీఫ్‌పై కోపం పెంచుకున్న యోగేందర్ అతడిని చంపేందుకు స్కెచ్ వేశాడు. మధ్యప్రదేశ్‌కు వెళ్లి తన ఫ్రెండ్ లల్లూశర్మతో కలిసి ఈ ఏడాది జనవరిలో రూ.20వేలతో తుపాకీ, మూడు రౌండ్ల బుల్లెట్లు కొన్నాడు.
3 నెలల కిందటే రెక్కీ..
ఈసీఐఎల్ క్రాస్‌రోడ్‌లో షరీఫ్‌ను చంపేందుకు 3 నెలల కిందట యోగేందర్ రెక్కీ నిర్వహించాడు. కానీ రెండ్రోజుల్లో డబ్బులు ఇస్తానని షరీఫ్ చెప్పడంతో ప్లాన్ మార్చుకున్నాడు. రోజులు గడుస్తున్నా షరీఫ్ డబ్బులు ఇవ్వకపోవడంతో శుక్రవారం అతడనికి చంపేందుకు యోగేందర్ సిద్ధమయ్యాడు. దీని గురించి సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు చర్లపల్లి ఆర్వోబీ వద్ద వెహికల్లో వెళ్తున్న యోగేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి వెహికల్, తుపాకీ, బుల్లెట్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.