- ఖాట్మండు జైలు నుంచి విడుదల
- ఆసియాలో 20కి పైగా మర్డర్లు
- మన దేశంలో 21 ఏండ్ల జైలు..
- రిలీజ్ తర్వాత ఫ్రాన్స్ వెళ్లిపోయిన ‘బికినీ కిల్లర్’
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్(78) నేపాల్ జైలు నుంచి శుక్రవారం రిలీజ్ అయ్యాడు. ఆరోగ్య కారణాల రీత్యా అతన్ని విడుదల చేస్తున్నట్టు నేపాల్ సుప్రీం కోర్టు వెల్లడించింది. సాయంత్రం అతను నేపాల్ నుంచి పోలీస్ ప్రొటెక్షన్ మధ్య ఫ్రాన్స్వెళ్లిపోయినట్టు అతని తరఫు అడ్వొకేట్ గోపాల్ శివకోటి చింతన్ మీడియాకు చెప్పారు. 1970 నుంచి ఆసియా వ్యాప్తంగా మొత్తం 20కి పైగా యంగ్ ఫారెనర్స్ను టార్గెట్ చేసుకుని చంపేశాడు. 1975లో శోభరాజ్ చేతిలో హత్యకు గురైన ఓ మహిళ డెడ్‌బాడీని బీచ్‌లో గుర్తించారు. అప్పుడు ఆమె బాడీపై బికినీ మాత్రమే ఉంది. అందుకే అతణ్ని ‘బికినీ కిల్లర్’ అని కూడా పిలుస్తుంటారు.
మన దేశంలోనూ హత్యలు
1976లో ఢిల్లీలోని ఓ హోటల్ లాబీలో 30 మందికి పైగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు శోభరాజ్ విషం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఫ్రెంచ్ టూరిస్ట్ మర్డర్ బయటికి వచ్చింది. నేరం రుజువు కావడంతో 12ఏండ్ల పాటు తీహార్ జైల్లో ఉన్నాడు. 1986లో బర్త్ డే పార్టీ పేరుతో జైలు సిబ్బందికి డ్రగ్స్ ఇచ్చి పారిపోగా.. తర్వాత పట్టుకున్నారు. 1997లో జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఫ్రాన్స్ వెళ్లిపోయాడు. మొత్తంగా ఇండియాలో ఆయా జైళ్లల్లో 21 ఏండ్లపాటు శిక్ష అనుభవించాడు. 2003 నేపాల్‌లో మర్డర్ కేసులో మళ్లీ పట్టుబడ్డాడు. అప్పటి నుంచి జైల్లో ఉన్న శోభరాజ్.. శుక్రవారం రిలీజ్ అయ్యాడు. శోభరాజ్ సైగాన్లో(వియత్నాం) ఇండో–వియత్నాం దంపతులకు పుట్టాడు.
రెండు సార్లు జీవిత ఖైదు
1975లో నేపాల్‌లో అమెరికాకు చెందిన కొన్నీ జో బ్రోంజిచ్ అనే మహిళను శోభరాజ్ హత్య చేశాడు. ఈ కేసులో అక్కడి పోలీసులు 2003లో అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో అక్కడి కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. అప్పటి నుంచి అతను ఖాట్మండు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. పదేండ్ల జైలు శిక్ష తర్వాత.. ఓ కెనడియన్ హత్య కేసులోనూ అతను దోషిగా తేలాడు. దీంతో మళ్లీ రెండో సారి జీవిత ఖైదు శిక్షకు గురయ్యాడు.