హైదరాబాద్ లో భారీ ప్రమాదం జరిగింది. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు(12760) పట్టాలు తప్పింది. రైలు వేగంగా వచ్చి ప్లాట్ ఫారం సైడ్ వాల్ కు ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలైనట్టు తెలుస్తుంది.
చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు.. చెన్నై నుంచి ఈ ఉదయం నాంపల్లికి చేరుకుంది. ప్లాట్ ఫాంపైకి వస్తున్న సమయంలో.. పట్టాలు తప్పి సైడ్ వాల్ ను ఢీకొట్టింది రైలు. ప్రమాదం సమయంలో సైడ్ వాల్ దగ్గర ఉన్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు రైల్వే అధికారులు. గాయపడిన వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని.. స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని డాక్టర్లు వెల్లడించారు.
చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం జరిగిన పట్టాలపై నిత్యం పదుల సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ట్రాక్ పైనే ఎంఎంటీఎస్ రైళ్లు సైతం వెళుతుంటాయి. అలాంటి ట్రాక్ పై చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పటంపై అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పట్టాలు తప్పిన బోగీలను సరిచేసే పనిలో ఉన్నారు.
విషయం తెలిసిన వెంటనే రైలు నిలయం నుంచి ఉన్నతాధికారులు నాంపల్లి వచ్చారు. ప్రమాదానికి కారణాలను పరిశీలిస్తున్నారు.