దేశంలో కుక్కల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. కుక్కల దాడిలో గాయపడ్డారనో, చనిపోయారనో వార్త రోజులో ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంది. తాజాగా ఒడిశాలో కుక్కలు వెంబడించడంతో స్కూటీపై వస్తున్న ఓ మహిళ ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఒడిశాలోని బెర్హంపూర్ లో రోడ్డుపై ప్రయాణిస్తోన్న ఓ స్కూటీని కుక్కలు వెంబడించాయి. ఆ సమయంలో స్కూటీపై ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. ఒక్కసారి కుక్కల గుంపు వెంటపడడంతో భయపడిపోయిన ఆ మహిళ.. ఎదురుగా ఏం జరుగుతుందో గ్రహించలేకపోయింది. అలా వేగంగా వెళుతున్న స్కూటీ, ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. దీంతో వాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులు కిందపడ్డారు. ఆ తర్వాత కుక్కలు అక్కడ్నుంచి పారిపోయాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అంతా జరిగిపోయింది. ఈ ఘటనలో బాలుడితో పాటు ఇద్దరు మహిళలకు గాయాలైనట్టు సమాచారం. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ముగ్గురూ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని, రైడర్ల ఆరోగ్యానికి హెల్మెట్ ధరించడం ముఖ్యం అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని బెర్హంపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ట్యా్గ్ చేస్తూ ఇంకొందరు స్పందిస్తున్నారు.