నార్త్ సౌండ్ : కెప్టెన్ షై హోప్ (83 బాల్స్‌లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 109 నాటౌట్) సెంచరీకి తోడు రొమారియో షెఫర్డ్ (28 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 నాటౌట్) మెరుపు లతో భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసిన వెస్టిండీస్ తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత ఇంగ్లండ్ 50 ఓవర్లలో 325 రన్స్‌కు ఆలౌటైంది.
హ్యారీ బ్రూక్ (71), జాక్ క్రాలీ (48), ఫిల్ సాల్ట్ (45) రాణించారు. కరీబియన్ బౌలర్లలో షెఫర్డ్, మోటీ, ఒషేన్ థామస్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం షై హోప్, షెఫర్డ్‌కు తోడు అలిక్ అతాజనె (66) రాణించడంతో విండీస్ 48.5 ఓవర్లలో 326/6 స్కోరు చేసి గెలిచింది. హోప్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. రెండో వన్డే బుధవారం జరుగుతుంది.