- 345 లక్ష్యాన్ని కరిగించి లంకపై గెలుపు
- వరల్డ్ కప్‌లో హయ్యెస్ట్ టార్గెట్ ఛేజ్ చేసిన జట్టుగా రికార్డు
- శ్రీలంకకు వరుసగా రెండో ఓటమి
హైదరాబాద్, వెలుగు: వన్డే వరల్డ్ కప్‌లో హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చిన ఆఖరాట అభిమానులకు మస్తు మజా అందించింది. ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్, శ్రీలంక చెరో రెండు సెంచరీలతో దంచికొట్టాయి. ఈ పరుగుల మోతలో పైచేయి సాధించిన పాక్ వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక టార్గెట్ ఛేజ్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.
మొహమ్మద్ రిజ్వాన్ (121 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 నాటౌట్), అబ్దుల్లా షఫీక్ (103 బాల్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 113) సెంచరీలతో దంచికొట్టడంతో 345 రన్స్ టార్గెట్‌ను ఈజీగా అందుకున్న పాక్ 2011 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ ఛేజ్ చేసిన 329/7 రన్స్ రికార్డును బ్రేక్ చేసింది.
మంగళవారం జరిగిన ఈ హైస్కోరింగ్ పోరులో పాక్ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసి రెండో విజయం ఖాతాలో వేసుకుంది. లంక వరుసగా రెండోసారి ఓటమి పాలైంది. టాస్ నెగ్గిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 344/9 స్కోరు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (0) డకౌటైనా కుశాల్ మెండిస్ (77 బాల్స్‌లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 122), సదీర సమరవిక్రమ (108 బాల్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 108) సెంచరీలతో కొట్టారు.
పాథుమ్ నిశాంక (51) ఫిఫ్టీతో మెరవగా పాక్ బౌలర్లలో హసన్ అలీ 4, హారిస్ రవూఫ్ 2 వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో పాక్ 48.2 ఓవర్లలో 345/4 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్ ఇమామ్(12), కెప్టెన్ బాబర్ (10) ఫెయిలవగా షఫీక్, రిజ్వాన్ మూడో వికెట్‌కు 176 రన్స్ జోడించారు.
కండరాల నొప్పితో ఇబ్బంది పడుతూనే పోరాటం కొనసాగించిన రిజ్వాన్.. సౌద్ షకీల్ (31), ఇఫ్తికార్ అహ్మద్ (22 నాటౌట్) సపోర్ట్‌తో టీమ్‌ను గెలిపించాడు. అతనికే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. వన్డే మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు నమోదవడం ఇది మూడోసారి కావడం విశేషం. కాగా, శనివారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో పాక్ అహ్మదాబాద్‌లో టీమిండియాతో తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 50 ఓవర్లలో 344/9 (కుశాల్ మెండిస్ 122, సదీరా సమరవిక్రమ 108, హసన్ అలీ 4/71, హారిస్ రవూఫ్ 2/64). పాకిస్తాన్: 48.2 ఓవర్లలో 345/4 (అబ్దుల్లా షఫీక్ 113, రిజ్వాన్ 131 నాటౌట్, మధుషనక 2/60).
హాస్పిటల్‌కు మెండిస్
మ్యాచ్ సందర్భంగా తీవ్రమైన కండరాల నొప్పితో బాధపడిన కుశాల్ మెండిస్‌ను హాస్పిటల్‌కు తరలించారు. సెంచరీ తర్వాత అతని కాలి కండరాలు పట్టేశాయి. ఫిజియోలు ఎంత ప్రయత్నించినా సెట్ కాకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతనికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా తర్వాత మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న సందిగ్ధత మొదలైంది.