బీజేపీ, బీఆర్​ఎస్​ను తరిమి కొట్టాలి : దీపక్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణ, చత్తీస్​ఘడ్​ రాష్ట్రాల్లో కాంగ్రెస్​ ప్రభుత్వం రానుందని చత్తీస్​ఘడ్​ పీసీసీ ప్రెసిడెంట్​ దీపక్​ అన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఆయన పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్​ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తో కలిసి రోడ్​షో నిర్వహించారు. ఇల్లెందు పట్టణం జగదాంబ సెంటర్లో జరిగిన రోడ్​ షోలో దీపక్​ మాట్లాడారు. 15ఏండ్లు చత్తీస్గడ్​లో బీజేపీ అబద్ధాల పాలన చేసిందన్నారు. తెలంగాణలో బీజేపీతో పాటు దాని తోక పార్టీ బీఆర్​ఎస్​ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్​ గాలి వీస్తొందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చిందని, అభివృద్ధిని కాంగ్రెస్​ పార్టీ చూసుకుంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. తెలంగాణలో బీఆర్​ఎస్​ సర్కార్​ కు దోచుకోవడమే తప్ప ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోలేదన్నారు. రాష్ట్రం నుంచి కేసీఆర్​ను, ఇల్లెందు నుంచి బీఆర్​ఎస్​ క్యాండిడేట్​ భానోత్​ హరిప్రియను తరిమి కొట్టాలన్నారు. 

ఓటు అనే ఆయుధంతో కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొట్టాలె : పొంగులేటి

ఈ నెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఓటర్లంతా కాంగ్రెస్​కు ఓటేసి కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొట్టాలని పీసీసీ ప్రచారం కమిటీ కో చైర్మన్​ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. తొమ్మిదిన్నరేండ్లు తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుందన్నారు. సోనియా తెలంగాణను ఇస్తే కేసీఆర్​ దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగించారన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ బీఆర్​ఎస్​ ప్రభుత్వం చాతకాని పనితీరుతో అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు.

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్​ మర్చిపోయారన్నారు. బొగ్గు గనులకు పుట్టినిల్లు అయిన ఇల్లెందు ప్రజలంతా ఆలోచించి కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోరం కనకయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్​ అభ్యర్థి కోరం కనకయ్యతో పాటు కాంగ్రెస్​, సీపీఐ, టీజేఎస్​ నేతలు రాంరెడ్డి గోపాల్​రెడ్డి, డి. వెంకటేశ్వరరావు, మల్లెల రామనాథం, కె. సారయ్య  పాల్గొన్నారు.