
ములుగు జిల్లా కర్రె గుట్టలో మావోయిస్టుల ఏరివేతకు భద్రతా బలగాలు శ్రీకారం చుట్టారు. ఆపరేషన్ కగార్ పేరుతో రెండు రోజులుగా ఛత్తీస్ గడ్.. తెలంగాణ సరిహద్దుల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. కర్రెలగుట్టను పోలీసు బలగాలు అష్ట దిగ్భంధనం చేశాయి.
ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రెగుట్టలోని బంకర్లలో హిడ్మా మడవి దళం సభ్యులు తలదాచుకున్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వైపుగా విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
బచావో కర్రెగుట్టలు పేరుతో.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కర్రెగుట్టల వైపు ఆదివాసులు రావద్దు అంటూ.. ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు మావోయిస్టులు. మావోయిస్టులకు ఆహార పదార్దాలు సరఫరా కాకుండా డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ చత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలను ఆక్టోపస్ పోలీస్ బలగాలు దిగ్బందించారు. వేలాది సంఖ్యలో పోలీసు బలగాలు ఐదు రాష్ట్రాల నుండి తరలివచ్చి కర్రెగుట్టలను చుట్టుముట్టారు. గుట్టపైన మావోయిస్టులు భారీ ఎత్తున ఉన్నారన్న సమాచారం మేరకు వారిని నేరుగా అటాక్ చేసేందుకు పోలీసు బలగాలు చుట్టుముట్టారు. నక్సలైట్లు ఏ వైపు నుండి కూడా తప్పించుకోకుండా ఉండేందుకు గుట్ట చుట్టూ మోహరించి ఉండడం వల్ల ఎవరు కూడా తప్పించుకునే అవకాశాలు లేకుండా పోయాయి.
మావోయిస్టులు క్లైమోర్ మైన్స్‌ను గుట్ట చుట్టూ పాతి పెట్టడం వల్ల పోలీసులు గుట్టపైకి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. మావోయిస్ట్‌లు భారీ ఎత్తున ఉన్నారన్న సమాచారం మేరకు తెలంగాణ, ఆంధ్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక పోలీస్ దళాలను ఆక్టోపస్ ఆధ్వర్యంలో కర్రె గుట్టలను చుట్టుముట్టడం అన్ని రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. నడుచుకుంటూ గుట్టపైకి పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి.