కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ప్రాజెక్టులు : ఎంపీ లక్ష్మణ్

కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ప్రాజెక్టులు : ఎంపీ లక్ష్మణ్
  • చతుర్విధ జల ప్రక్రియను అమలు చేయాలి
  • రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: ప్రముఖ నీటి పారుదల రంగ నిపుణులు హనుమంత రావు సూచించిన చతుర్విధ జల ప్రక్రియను అమలు చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలమయ్యాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంట్రాక్టర్లకు మేలే చేసేందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టాయని ఆరోపించారు. బుధవారం రాజ్యసభ జీరో అవర్​లో  దేశంలో తాగునీటి సమస్య అంశాన్ని ఎంపీ లేవనెత్తారు. ఉమ్మడి ఏపీలో జహీరాబాద్​లోని గొట్టిగారిపల్లిలో హనుమంతరావు సూచించిన చతుర్విధ జల ప్రక్రియను అమలు చేసినట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో కేవలం రూ.5 వేలతో ఎకరానికి నీరు అందించగలిగినట్టు సభకు వివరించారు.

23 ఏండ్లుగా ఏడాదికి మూడు పంటలతోపాటు, చుట్టుపక్కల గ్రామాలకు మంచినీటిని అందిస్తున్నట్టు తెలిపారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తెలంగాణ ఏర్పాటు తర్వాత గద్దెనెక్కిన బీఆర్ఎస్.. చతుర్విధ ప్రక్రియను విస్మరించాయని చెప్పారు. మేజర్ ప్రాజెక్టు పేరుతో దాదాపు ఎకరాకు రూ.7 లక్షల నుంచి 8 లక్షలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకేనని విమర్శించారు. ఇదే హనుమంత రావు సూచించిన చతుర్విధ జల ప్రక్రియను రాజస్తాన్ సర్కార్ 33 జిల్లాల్లో అమలు చేస్తున్నదన్నారు. ఈ జిల్లాల్లో సాగు, తాగు నీటి విషయంలో విజయవంతమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.