రూ.150 కోట్లతో మున్సిపాలిటీని అభివృద్ధి చేశాం

చౌటుప్పల్ వెలుగు  : ఐదేండ్లలో రూ.150 కోట్లతో చౌటుప్పల్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని మున్సిపాలిటీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు తెలిపారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మోడల్ గా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ముందుకుసాగుతున్నామని చెప్పారు. మున్సిపాలిటీలో రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. 

రూ.55 కోట్ల మున్సిపల్ నిధులు, రూ.45 కోట్ల ఇతర నిధులతో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. మున్సిపాలిటీలో ప్రధాన సమస్య అయిన మంచినీటి కోసం నాలుగు ట్యాంకుల నిర్మాణానికి పనులు ప్రారంభించామని, అవి ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 

తంగడపల్లి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశామని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, చిన్న కొండూరు రోడ్డు విస్తరణ పనులు, చౌటుప్పల్ మినీ ట్యాంక్ బండ్ లాంటి పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. చౌటుప్పల్ వరకు మెట్రో రైలు మార్గం కోసం ఎమ్మెల్యేతో కలిసి ప్రభుత్వానికి విన్నవించామని, త్వరలోనే అది కూడా సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.