సెల్ ఫోన్ దొంగల అరెస్టు 

సెల్ ఫోన్ దొంగల అరెస్టు 

చౌటుప్పల్, వెలుగు : వరుసగా సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను చౌటుప్పల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్​ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన గొర్ల శివపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్స్​లో దొంగతనం కేసులు ఉన్నాయి. శివ జీవనోపాధి కోసం ఆటో నడుపుతూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో చుట్టుపక్కల గ్రామాల్లో దొంగతనాలు చేస్తున్న అంబటి శ్రీను, మేకల క్రాంతితో శివకు పరిచయం ఏర్పడింది.

ఆ ముగ్గురు ముఠాగా ఏర్పడి సెల్ ఫోన్లు దొంగిలించడం ప్రారంభించారు. హైదరాబాద్ వెళ్లి దొంగతనాలు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాధించవచ్చని నిర్ణయించుకున్నారు. ముగ్గురు కలిసి తుర్కయంజాల్ లో అంబటి శివ బంధువైన అమ్మోరి గణేశ్​తో కలిసి విజయవాడ నుంచి హైదరాబాద్ జాతీయ రహదారి వెంట వివిధ ప్రాంతాల్లో సెల్ ఫోన్లను దొంగిలించి వాటిని అమ్మి వచ్చిన డబ్బును సమానంగా పంచుకున్నారు. ఈ తరుణంలో జూన్ 2న చౌటుప్పల్ బస్టాండ్ వద్ద హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సులో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలించారు.

బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్​పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. లొకేషన్ ట్రేస్ చేసిన పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ధర్మోజిగూడెం క్రాస్ రోడ్ వద్ద గొర్ల శివ, అంబటి శ్రీను, మేకల క్రాంతిని అదుపులోకి  తీసుకున్నారు. మరో నిందితుడు అమ్మోరి గణేశ్ పరారీలో ఉన్నట్లు చౌటుప్పల్ సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.