లోన్లు, సబ్సిడీ పేరుతో మోసం చేసిన్రు

    
బషీర్ బాగ్, వెలుగు:  అరిజన్ డెయిరీ పేరుతో తమను మోసం చేసిన సంస్థ  డైరెక్టర్ ఆదినారాయణ,  సీఈవో  షేజల్​పై విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు.  వివిధ రాష్ట్రాలకు చెందిన బాధిత రైతులు హైదరాబాద్  హైదర్ గూడ లోని ఎన్ఎన్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు..  బర్రెలపై ఇన్సూరెన్స్ పేరిట లోన్లు ఇప్పిస్తామని,  సంస్థలో  డైరెక్టర్ పోస్టు ఇస్తామని చెప్పి తమను మోసం చేశారన్నారు.  

మహారాష్ట్రకు చెందిన ఓ రైతు వద్ద బర్రెలను కొని చెక్కు ఇచ్చారని... ఆ చెక్ బౌన్స్ కావడంతో మహారాష్ట్రలో  కేసు కూడా నమోదు చేసినట్లు బాధిత రైతు తెలిపాడు.  గ్రామీణ ప్రాంత రైతులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.  ఈ అంశంపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వద్ద ఫిర్యాదు చేయగా ఆయన వారిని పిలిపించి డబ్బులు చెల్లించాలని సూచించాడని చెప్పారు. 

దీంతో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. వీరు 15 ఏండ్లుగా ప్రజల్ని మోసం చేస్తున్నారని తెలిపారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 16 కేసులు ఉన్నాయని,  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 1,600 మంది నుంచి రూ.68లక్షలు వసూలు చేశారని పేర్కొన్నారు. వీరిపై నార్త్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో బాధిత రైతులు సంతోష్​ కుమార్ , శ్రీపతి బుచ్చన్న ,  జాడి      రాజేశ్​,  ఎస్ . తిరుపతి పాల్గొన్నారు.