వే బ్రిడ్జితో రైతులను మోసం చేశాడు..

నల్లగొండ జిల్లాలో ఘరానా మోసం బయటపడింది. రైతులు పండించిన పంటను తూకం వేయమని వస్తే భారీ స్కాం చేశాడు ఓ కేటుగాడు. వివరాల్లోకి వెళ్తే నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలోని వే బ్రిడ్జి తూకంలో భారీ స్కాం బయటపడింది. వడ్ల తూకంలో ట్రాక్టర్ కి 2 క్వింటాల మేరా తేడా రావడంతో రైతు అనుమానం వ్యక్తం చేశాడు. వే బ్రిడ్జి యజమానిని నిలదీశాడు. దీంతో అక్కడ రసాభాస చోటుచేసుకుంది. వెంటనే రైతులు పోలీసులను ఆశ్రయించారు. 

సమాచారం తెలుసుకున్న పోలీసులు వే బ్రిడ్జి వద్దకు చేరుకుని దర్యాప్తు చేశారు. నిందితుడిపై విచారణ జరిపి కేసు నమోదు చేసుకుంటామని పోలీసులు తెలిపారు. గత రెండు నెలలుగా వే బ్రిడ్జి యజమాని ప్రైవేట్ గా రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. మోసం తెలియడంతో రైతులు ఆందోళణకు దిగారు. పలుమార్లు మోస పోయామని మండిపడుతున్నారు.