ఆఫీసు ఎదుట 300 మంది బాధితుల ఆందోళన
ఖమ్మం టౌన్, వెలుగు : చిట్టీలు కట్టి రూ. కోట్లలో మోసపోయిన బాధితులు ఆందోళనకు దిగిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. తమ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి వందలాది బాధితులు ఆందోళనకు దిగారు. చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.
బాధితులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం సిటీ కొత్త బస్టాండ్ ఎదురుగా శ్రీరామ్ నగర్ కాలనీలోని అక్షర చిట్ ఫండ్ సంస్థ చిట్టీల పేరిట 800 మందిపైగా బాధితుల వద్ద రూ. కోట్లలో వసూలు చేసింది. చిట్టీ కట్టిన వాయిదాలు పూర్తయినా డబ్బులు చెల్లించకుండా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తుండగా 150 మందికి పైగా ఖమ్మం టూ టౌన్, ఖమ్మం రూరల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో రూ.1 లక్ష వరకు చిట్టీ కట్టినవారికి డబ్బులు చెల్లించేందుకు శనివారం పోలీసుల సాయంతో చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ పేరా శ్రీనివాసరావు ఆఫీస్ కు వచ్చారు. రూ.1 లక్ష కట్టినవారికి రూ. 30 వేలు, రూ.50 వేలు కట్టినవారికి రూ. 15 వేలు ఇస్తూ సంతకాలు తీసుకుంటుండగా బాధితులు ప్రశ్నించారు.
రూ. లక్షలోపు వారికి తన వద్ద ఉన్న డబ్బులు ఇప్పుడు చెల్లిస్తానని మిగతా వారికి వచ్చే గురువారం చెల్లిస్తానని చైర్మన్ తెలిపారు. అదేవిధంగా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చిట్టీ కట్టినవారికి ఖమ్మం రూరల్ మండలం అరేంపుల వద్ద ఉన్న తన భూమిలో ప్లాట్లు చేసి.. చిట్టీ డబ్బులు పోను.. మిగతావి ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తానని చైర్మన్ చెప్తున్నాడని బాధితులు వాపోయారు.
అయితే.. విలువ లేని భూమి కొనుగోలుకు చిట్టీలు కట్టినవారు ఆసక్తి చూపడం లేదు. శనివారం రాత్రి 12 గంటల వరకు రూ. లక్ష కట్టిన వారికి చెల్లించి వెళ్తానని చైర్మన్ చెబుతుండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 800 మంది వరకు బాధితులు మోసపోయినట్లు చెబుతున్నారు. చిట్ ఫండ్ చైర్మన్ డబ్బులు చెల్లిస్తున్నాడని తెలుసుకోవ డంతో బాధితులు మరింతగా పెరిగారు. చైర్మన్ ఇచ్చే డబ్బులు తీసుకునేందుకు ఆసక్తి చూపని వారు కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.