- ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మోసం
- టీజీఎస్పీడీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ పై కేసు నమోదు
ఎల్బీనగర్, వెలుగు: కరెంట్ ఆఫీస్‌లో జాబ్ ఇప్పిస్తానని డబ్బులు గుంజి, నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్‌పై నాగోల్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. నాగోల్ మమతనగర్కు చెందిన ఓ యువతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపర్ అవుతోంది. విద్యుత్ శాఖలో (టీజీఎస్పీడీసీఎల్) భువనగిరిలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బండారపు కిరణ్ కుమార్ 2021లో ఆమెకు పరిచయమయ్యాడు. తనకు కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని, 2021 నుంచి 2024 వరకు విడతల వారీగా రూ.19,50 లక్షలు తీసుకున్నాడు.
ఆపై ఉద్యోగం ఇప్పించకుండా కాలయాపన చేస్తుండడంతో ఇటీవల యువతి నిలదీసింది. దీంతో అతను అపాయింట్మెంట్ లెటర్ తీసుకొచ్చి ఇవ్వగా, అది ఫేక్ అని తేలడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని మరోసారి గట్టిగా అడిగింది. ఈ విషయంలో పెద్ద మనుషులు జోక్యం చేసుకోవడంతో ఆరు నెలల్లో డబ్బులు ఇస్తానని అంగీకరించారు. ఆరు నెలలైనా డబ్బులు ఇవ్వకపోవడంతో నాగోలు పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. కిరణ్ కుమార్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.