ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెన్సీ పేరుతో.. దగా చేస్తున్రు

  • రూ.500 కడితే రూ.30 వేలిస్తామని మోసం చేస్తున్న అక్రమార్కులు
  • కిబో సేవింగ్​ అకౌంట్​ పేరుతో మధ్య తరగతి ప్రజలను టార్గెట్​ చేస్తున్న నిర్వాహకులు
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5 వేల మంది నుంచి రూ.25 లక్షలకు పైగా వసూలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కోటీశ్వరుడైన ఓ అమెరికన్​ పేద, మధ్య తరగతి ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడని, రూ. 500 చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారికి ఆర్థికసాయం అందిస్తారని చెబుతూ వైజాగ్​ కేంద్రంగా వెలసిన ఓ సంస్థ జిల్లా ప్రజలను దగా చేస్తోంది.  నెల నెలా కాయిన్స్​రూపంలో డబ్బులొస్తాయని, ఏడు నెలల తర్వాత రూ.30 వేలు ఇస్తారని నమ్మించడంతో కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, ముల్కలపల్లి, టేకులపల్లి, ఆళ్లపల్లి, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలాలకు చెందిన వందలాది మంది సభ్యులుగా చేరారు. ఇలా ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5 వేల మందికి పైగా చేరి రూ.25 లక్షల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. 

ఇలా మోసం చేస్తున్రు..

ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి ప్రజలను నిర్వాహకులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. సెల్​ఫోన్​లో యాప్​ డౌన్​లోడ్​ చేసుకొని కిబో సేవింగ్​ అకౌంట్​లో డబ్బులు జమ చేయాలని సూచిస్తున్నారు. తమ సెల్ ఫోన్లో కిబో పేర డిజిటల్​ కరెన్సీ​యాప్, అందుకు సంబంధించిన వివరాలను చూపిస్తున్నారు. ఒకసారి రూ.500 చెల్లిస్తే ప్రతి నెలా కాయిన్స్​ వస్తాయని, వాటి విలువ రూ.200 నుంచి రూ. వెయ్యి వరకు ఉంటుందని నమ్మిస్తున్నారు. వాటిని డ్రా చేసుకోవచ్చని, 7 నెలల తర్వాత రూ. 30 వేలు వస్తాయని చెబుతున్నారు. వాటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, ఇదంతా ఓ అమెరికన్​ చేస్తున్న సాయం అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. వారి మాటలు నమ్మిన ప్రజలు పెద్ద ఎత్తున జాయిన్​ అవుతున్నారు. 

సభ్యులుగా చేర్పిస్తే నజరానా..

ఈ స్కీమ్​లో చేర్పించే వారికి నిర్వాహకులు నజరానాలు అందిస్తామని చెబుతున్నారు. 66 మంది చేర్పిస్తే రూ.25 వేల నుంచి రూ.30 వేల విలువైన సెల్ ఫోన్, రెండో లెవెల్​ నుంచి132 మంది జాయిన్​ అయితే బైక్, మూడో లెవెల్​ నుంచి 1584 మంది జాయిన్​ అయితే కారు ఇస్తామని చెబుతున్నారు. 

లోన్లు ఇప్పిస్తామని..

ఇల్లందు ప్రాంతంలో రూ. వెయ్యి ఇస్తే బ్యాంక్​ లోన్​ ఇప్పిస్తామని చెప్పి ఓ మహిళ, ప్రైవేట్​ బ్యాంక్​ మేనేజర్​ కలిసి 100  మంది మహిళల నుంచి డబ్బులు వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా లోన్​ రాకపోవడంతో కొత్తగూడెంలోని బ్యాంక్​ వద్దకు వచ్చి బాధిత మహిళలు ఇటీవల ఆందోళన చేశారు. 

అత్యాశతో మోసపోవద్దు 

ఆర్బీఐ అనుమతి​లేకుండా డిజిటల్​ కాయిన్స్​ పేరుతో మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి నేరాలపై పోలీస్​ స్టేషన్ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. గ్రామ స్థాయిలో అవేర్నెస్​ క్యాంపుల నిర్వహణకు ప్లాన్​ చేస్తున్నాం. కిబో సేవింగ్​ అకౌంట్​ పేరుతో జరుగుతున్న మోసంపై దృష్టి పెడతాం. 

- డాక్టర్​ వినీత్, ఎస్పీ, భద్రాద్రికొత్తగూడెం​