స్టాక్స్లో భారీ లాభాలపేరుతో ..రూ.14.63 లక్షల చీటింగ్

స్టాక్స్లో భారీ లాభాలపేరుతో ..రూ.14.63 లక్షల చీటింగ్

బషీర్​బాగ్, వెలుగు: స్టాక్​మార్కెట్​లో పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తిని మోసగించి రూ.14.63 లక్షలు కొట్టేసిన సైబర్​నేరగాడిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ప్రైవేట్​ఉద్యోగి(35) వాట్సాప్​కు ఇటీవల స్టాక్ ​మార్కెట్​లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఓ నంబర్ నుంచి మెసేజ్​వచ్చింది. స్పందించడంతో స్టాక్స్​ కొనడం, అమ్మడంపై సలహాలు, సూచనలు ఇస్తామంటూ మరికొన్ని మెసేజ్​లు వచ్చాయి.

అందులో ఇప్పటికే పలువురు ఇన్వెస్ట్​చేయగా లభాలు వచ్చినట్లు స్కీన్​షాట్లు ఉన్నాయి. నిజమేనని నమ్మిన ప్రైవేట్​ఉద్యోగి వాట్సాప్​లో వచ్చిన లింక్​క్లిక్​చేసి మొత్తం రూ.14లక్షల63వేల046 ఇన్వెస్ట్​చేశాడు. దాదాపు 20 శాతం లాభాలు వస్తున్నాయని తర్వాత వాట్సాప్​లో మెసేజ్​లు వచ్చాయి. కొన్నిరోజుల తర్వాత లాభాలు వరకు విత్ డ్రా చేసుకుంటానని కోరగా, డబ్బంతా ఐపీఓలో పెట్టామని, విత్ డ్రా చేయడానికి సమయం పడుతుందని మెసేజ్​లు వచ్చాయి. ఇంకా ఇన్వెస్ట్​ చేస్తే మరిన్ని లాభాలు వస్తాయని ఒత్తిడి చేయడంతో మోసపోయానని గ్రహించాడు. 

ఇన్ని రోజులు అతను మాట్లాడింది, డబ్బులు పంపించింది సైబర్​నేరగాళ్లకు అని తెలుసుకున్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్​స్పెక్టర్ కె.సతీశ్​ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించగా, ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న శివ శంకర్(27) ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. శివశంకర్​పై ఇదే తరహాలో తమిళనాడులో ఓ కేసు నమోదు అయినట్లు తెలుసుకున్నారు. అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.