విద్యార్థుల అడ్మిషన్ల సొమ్ము రూ.2 కోట్లు కాజేత.. ముగ్గురు ఉద్యోగుల అరెస్ట్​

విద్యార్థుల అడ్మిషన్ల సొమ్ము రూ.2 కోట్లు కాజేత.. ముగ్గురు ఉద్యోగుల అరెస్ట్​

గచ్చిబౌలి, వెలుగు: విద్యార్థుల అడ్మిషన్ల రికార్డులను తారుమారు చేసి రూ.2 కోట్ల వరకు చీటింగ్​చేసిన చైతన్య డీమ్డ్ ​టూ బి యూనివర్సిటీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను సైబరాబాద్​ ఈఓడబ్ల్యూ అధికారులు అరెస్ట్​ చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్​తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్​నగర్​ గ్రామంలో చైతన్య డీమ్డ్ ​టూ బి యూనివర్సిటీ ఉంది.  ఈ వర్సిటీలో వరంగల్​ జిల్లా కాజీపేట్‌‌కు చెందిన సానికొమ్ము సుమ అడ్మిషన్​ విభాగానికి డీన్ ​అండ్ ​ఇన్​చార్జ్​గా పని చేస్తోంది.  ఇదే అడ్మిషన్​ డిపార్ట్​మెంట్‌‌లో హన్మకొండకు చెందిన భూపతి దినకర్, బుర్ర శ్రీకాంత్​ పని చేస్తున్నారు.

ఈ కాలేజీలో వివిధ రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు కొందరు నేరుగా, మరి కొందరు కన్సల్టెన్సీ లేదా ఏజెంట్ల ద్వారా అడ్మిషన్లు పొందుతారు.  విద్యార్థులు కన్సల్టెన్సీ, ఏజెంట్​ద్వారా అడ్మిషన్లు పొందితే ఏజెంట్లకు కాలేజీ మేనేజ్​మెంట్​ కమీషన్లు ఇస్తుంది.  దీన్ని అసరాగా చేసుకున్న సుమ,  దినకర్, శ్రీకాంత్​లతో కలిసి డైరెక్ట్​గా కాలేజీలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులను ఏజెంట్లు, కన్సల్టెన్సీ ద్వారా అడ్మిషన్లు పొందినట్లు నకిలీ రికార్డులు సృష్టించారు. 

 అడ్మిషన్లలో ఏజెంట్​ ద్వారా అడ్మిషన్​లు తీసుకున్నట్లు రికార్డులు మార్చి కమిషన్​ను తమ అకౌంట్లోకి మళ్లించుకున్నారు.  దాదాపు రూ. 2 కోట్ల వరకు డబ్బులను తమ అకౌంట్​లకు మళ్లించినట్లు కాలేజీ ఫౌండర్​ డా. వెంకట పురుషోత్తంరెడ్డి గుర్తించి సైబరాబాద్​ ఎకనామిక్​ అఫెన్సెస్​ వింగ్​ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.  వీరి నుంచి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం 
చేసుకున్నారు.