అబద్ధపు హామీలతో మోసం చేస్తున్రు

అబద్ధపు హామీలతో మోసం చేస్తున్రు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఆరున్నరేండ్లు గడుస్తోంది. ఎన్నో ఆశలు, ఆశయాలతో ఏర్పడిన రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని అంతా ఆశపడ్డాం. కానీ, టీఆర్ఎస్​ ప్రభుత్వం ఆరున్నరేండ్లలో రాష్ట్రాన్ని బేఖారు తెలంగాణ చేసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన 1,200 మంది కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. కానీ, సీఎం కేసీఆర్, ఆయన ఫ్యామిలీ, ఆయనకు అతి దగ్గరి వారు మాత్రమే బాగుపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఎదురైన ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హడావుడిగా జీహెచ్​ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్​ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపక్షాలకు టైం ఇవ్వకుండా షెడ్యూల్​ రిలీజ్​ చేయడమే కాదు.. దొడ్డిదారిలో మేయర్​ పదవిని చేపట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దుబ్బాక దెబ్బతో సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, ఆ పార్టీ నేతలు లోలోపల భయపడుతూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. దుబ్బాకలో లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని చెప్పారు. కానీ లక్ష మెజారిటీ కాదు కదా లక్షణంగా మిమ్మల్ని ఓడించి జనం నేలకు దించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్​కు జనం షాక్​ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

ఒక్క హామీ కూడా అమలు చేయలేదు

గ్రేటర్​ ఎన్నికల్లో సెంచరీ(100 సీట్లు) కొడతామని కేటీఆర్​ చెబుతున్నారు. సెంచరీ సాధిస్తామనే ధీమా ఉన్నప్పుడు ఎక్స్​ అఫీషియో ఓట్లు ఎందుకు అవసరమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్​ ప్రజలు గతంలో మీరు చెప్పిన మాటలు నమ్మి మోసపోయారు. లక్ష డబుల్​ బెడ్ రూం ఇండ్లు ఇస్తామన్నారు. ఓట్లు వేసిన తెల్లారే గృహప్రవేశాలని చెప్పారు. హుస్సేన్​ సాగర్​ నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తామన్నారు. ఆ నీటిని వాటర్​ బాటిళ్లతో పట్టుకుని తాగేలా చేస్తామన్నారు. హైదరాబాద్ ను డల్లాస్ చేస్తామని, ఓల్డ్​ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, లష్కర్​ను జెరుసలేం చేస్తామని ఎన్నో చెప్పారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు.

దారుణంగా మారిన సిటీ పరిస్థితులు

టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చి ఆరున్నరేండ్లయినా హైదరాబాద్​ రూపు ఏ మాత్రం మారలేదు. పైగా గతంలో కంటే పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. దానికి తాజా ఉదాహరణ ఇటీవల వచ్చిన వరదలే. నగరంలోని చెరువులు, నాలాలు, డ్రైనేజీలన్నింటినీ అధికార పార్టీ నేతలు కబ్జా చేసేశారు. అధికారంలోకి రాకముందు అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని చెప్పి.. పదవిలోకి వచ్చిన తర్వాత వాటి సంగతే మరిచిపోయారు. వాటి ఫలితంగానే మొన్నటి వర్షాలకు వందల కాలనీలు నీటమునిగాయి. రోడ్లు సముద్రాల్లా మారడంతో ప్రజలను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు చేర్చాల్సి వచ్చింది. ఇండ్లు పూర్తిగా నీట మునగడంతో చాలా మందికి నిలువ నీడ లేకుండా పోయింది.

వరద సాయం మింగేసిన టీఆర్ఎస్ నేతలు

వరద బాధితులను ఆదుకునేందుకు రూ.10 వేల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం దానిని కూడా సక్రమంగా అందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ.550 కోట్లను వరద సాయంగా ప్రకటిస్తే చాలా చోట్ల టీఆర్ఎస్​ కార్యకర్తలే ఆ మొత్తాన్ని జేబులో వేసుకున్నారు. ప్రజలకు నామ్​కే వాస్తేగా కొంత మొత్తం అందించి మిగతాది మింగేశారు. పైగా కొన్ని చోట్ల వరద సాయానికి, గ్రేటర్​ ఎన్నికలకు ముడిపెట్టారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బులనే ఇస్తూ.. అదేదో సొంత జేబులో నుంచి ఇస్తున్నట్టు టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. 

సీఎంఆర్​ఎఫ్​ నిధులు ఏమయ్యాయి

కరోనా టైంలోనూ, వరదలు ముంచెత్తినప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, సినిమా పరిశ్రమకు చెందిన వారు, కార్పొరేట్​ విద్యాసంస్థలు, సామాన్యులు కోట్లాది రూపాయలను విరాళంగా అందజేశారు. కానీ, సీఎంఆర్ఎఫ్​ నుంచి ఇప్పటి వరకూ ఎంత మందికి సాయం అందించారంటే సమాచారం లేదు. కరోనా టైంలో, వరద సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి సాయం చేస్తే కష్టాల నుంచి గట్టెక్కేవారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీఎంఆర్ఎఫ్​ కు వచ్చిన విరాళాలు ఎంత, అందులో ఎన్ని నిధులను బాధితులకు అందించారనే దానిపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి.

గ్రేటర్​ హైదరాబాద్​ ప్రజలారా! ఇకనైనా కుటుంబ పాలన ప్రభుత్వం మాటలు వినకండి. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు ప్రజల కోసం ప్రశ్నించే స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో లేదు. అందువల్ల అంబేద్కర్​ ఇచ్చిన బుల్లెట్​ కంటే పవర్​ఫుల్​ అయిన బ్యాలెట్​తో అవినీతి మకిలి లేని, సమర్థలైన నాయకులకే ఓటు వేయాలి. అవినీతి కార్పొరేటర్లకు మీ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి.