
అనంతపురం జిల్లా: రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగింది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అతడి ముఠా చెన్నైలో జాబ్ కన్సల్టెన్సీ ఆఫీసు తెరిచారు. తాజాగా వెలుబడ్డ రైల్వే జాబ్స్ ను ఆసరాగా చేసుకుని.. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు లాగారు. చివరకు బోర్డు తిప్పేయడంతో మోస పోయామని తెలుసుకున్న చెన్నై వాసులు.. అసలు నిందితుడి ఆధార్ నెంబర్..ఆధారంగా అడ్రస్ తెలుసుకున్నారు.
పలువురు బాధితులు అనంతపురం జిల్లా , గుంతకల్లు డీఆర్ఎం ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. నకిలీ నియామక పత్రాలతో 50 మంది దగ్గర దాదాపు రూ.10 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపించారు బాధితులు. బాధితుల ఫిర్యాదుతో కేసును గుంతకల్లు 1వ పట్టణ పోలీసులకు బదలాయించగా..అసలు నిందితుడు ఈ నెల 18న కరోనాతో చనిపోయినట్లు గుర్తించారు పోలీసులు. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.