తెగిన చెక్​ డ్యాం కట్ట..నీట మునిగిన పంటలు

జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​మండలం టేకుమట్ల శివారులోని వాగుపై నిర్మించిన చెక్​ డ్యాం కట్ట తెగిపోయి వరద నీరు రైతుల పొలాలను ముంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లతో రెండేళ్ల క్రితం ఈ చెక్ డ్యాంను నిర్మించింది. ఇందులో నిల్వ చేసిన నీళ్లతో చెరువులను నింపి పొలాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. కానీ ఆఫీసర్లు చెక్ డ్యాం నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు. రెండేళ్ల నుంచి భారీ వర్షాలు పడ్డప్పుడు వాగు ఉప్పొంగి పక్కనున్న సుమారు 40 ఎకరాల్లో నుంచి వరద పారుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెక్​డ్యాంకు గండి పడింది. పది మంది రైతులకు చెందిన 15 ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి.

టేకుమట్ల శివారులో మూడేళ్ల నుంచి సుందిళ్ల బ్యారేజ్ బ్యాక్ వాటర్​తో 150 ఎకరాలకు పైగా పంట భూములు మునిగి రైతులు నష్టపోతున్నారు. ఇది చాలదన్నట్టు రెండేళ్ల నుంచి చెక్ డ్యాం బ్యాక్ వాటర్​తో కూడా పంటలు మునగడంతో దిక్కుతోచని స్థితిలో  ఉన్నామని రైతులు వాపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు, ఆఫీసర్లకు చెప్పినా తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక లీడర్లు చెక్ డ్యాం నిర్మించిన కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు తీసుకొని అతనికే వత్తాసు పలుకుతున్నారని, రైతులకు జరుగుతున్న నష్టం గురించి పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చెక్ డ్యాం వల్ల పొలం మునుగుతోందని కాంట్రాక్టర్​కు ఫోన్​చేసి చెప్పగా తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడని ఓ రైతు తెలిపారు. 

కమీషన్ల కోసమే కట్టిన్రు

చెక్ డ్యాం బ్యాక్ వాటర్​తో మునిగిన పొలాలను బీజేపీ మండల అధ్యక్షుడు చల్ల విశ్వంభర్​రెడ్డి పరిశీలించారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్​వాటర్​తో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని, ఇప్పుడు చెక్ డ్యాం బ్యాక్ వాటర్​తో మరికొందరి పొలాలను ముంచుతున్నారని అన్నారు. కమీషన్ల కోసమే ఇష్టారీతిన చెక్​డ్యాం నిర్మించారని ఆరోపించారు. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.