తాగునీటి సమస్యకు చెక్​ .. నిజామాబాద్ జిల్లాకు రూ. కోటి 18 లక్షల ఫండ్స్ కేటాయింపు

తాగునీటి సమస్యకు చెక్​ .. నిజామాబాద్ జిల్లాకు రూ. కోటి 18 లక్షల ఫండ్స్ కేటాయింపు
  • 212 పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తింపు
  • పాత బోర్ల ఫ్లషింగ్, పైప్​లైన్,  అద్దె బోర్లకు నిధుల వినియోగం
  • కలెక్టర్​ ఆదేశాలతో ఇప్పటికే పనుల నిర్వహణ

కామారెడ్డి, వెలుగు :  ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లల్లో నీటి ఊటలు తగ్గడంతోపాటు మిషన్​భగీరథ ద్వారా కూడా సరిపడా నీటి సప్లయ్ జరగట్లేదు. పల్లెలు, తండాల్లో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం  ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫస్ట్​ విడతగా జిల్లాకు రూ.కోటి 18 లక్షలు నిధులు కేటాయించింది. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 

జిల్లాలో  212 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ చేస్తుంది.  మాచారెడ్డి, గాంధారి, లింగంపేట,  సదాశివనగర్, నాగిరెడ్డిపేట, బీబీపేట, భిక్కనూరు,  రాజంపేట తాడ్వాయి,  బిచ్​కుంద, మద్నూర్, జుక్కల్ మండలాల్లో నీటి సమస్య అధికంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. కలెక్టర్​ ఆదేశాలతో ఇప్పటికే పలు పల్లెల్లో తాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

వచ్చిన ఫండ్స్​ ఏమి చేస్తారంటే ..

జిల్లాకు వచ్చిన నిధులతో  కొద్ది పాటి నీళ్లు వస్తున్న బోర్లను ఫ్లషింగ్​ చేయటం, అవసరమైన చోట పైపులైన్​  వేయడం, మరమ్మతు పనులు చేస్తారు.  ఆర్​డబ్ల్యూఎస్​, పంచాయతీ బోర్లు పూర్తిగా వట్టిపోతే  ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని నీటిని సరఫరా చేయనున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 48 గ్రామాలకు రూ. 53. 36 కోట్ల ఫండ్స్​ కేటాయించారు. ఇటీవల కలెక్టరేట్​లో నిర్వహించిన సమావేశంలో పంచాయతీ సెక్రటరీలు, మండల, డివిజన్, జిల్లా అధికారులకు కలెక్టర్ తాగునీటి ఎద్దడి నివారణపై పలు సూచనలు చేశారు. 

సమస్య ఉన్న చోట పనులు చేస్తాం..

ఫస్ట్ విడతలో జిల్లాకు రూ. కోటి 18 లక్షల ఫండ్స్ వచ్చాయి.  ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పనులు చేపడుతాం. 212 పంచాయతీల్లో నీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించాం. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  ప్రతి పల్లెలో తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

రమేశ్​, ఈఈ ఆర్​డబ్ల్యుఎస్​, కామారెడ్డి