ఎన్నికల నగారా మోగడానికి ముందే రాష్ట్రాల వారీగా బలమైన కమ్యూనిటీలను బీజేపీ టచ్ చేసింది. కొంతకాలంగా మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో వెనుకబడ్డ కమ్యూనిటీకి చెందిన మటువాలను ప్రధాని నరేంద్ర మోడీ మంచి చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ కమ్యూనిటీకి పెద్ద దిక్కయిన బీణాపాణి దేవి (100) కన్నుమూ యడానికి నెల్లాళ్ల ముందు మోడీ స్వయంగా వెళ్లి కలిశారు. ఫిబ్రవరిలో బంగాన్ నియోజకవర్గం (పశ్శిమ బెంగాల్ )లోని ఠాకూర్ నగర్ లో బీణాపాణీ దేవి మనవడు శాంతను ఠాకూర్‌తో కలిసి ఒక సభలో కూడా పాల్గొన్నారు.
ఆయన మటువా కమ్యూనిటీకి నాయకుడిలా ఎదుగుతున్నాడు. దీన్ని బట్టి బీజేపీ ఆ సామాజిక వర్గానికి ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. బంగాన్ సెగ్మెంట్ఉత్తర 24 పరగణాల జిల్లాలో బంగ్లాదేశ్ బోర్డర్‌కి దగ్గరగా ఉంది. తృణమూల్ రెండుసార్లు రాష్ట్రంలో అధికారానికి రావడానికి మటువా మహా సంఘం సపోర్ట్ చేసింది. ఈ ఈక్వేషన్ ఇప్పుడు మారింది. సార్వత్రిక ఎన్నికల్లో మటువాలు రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. కొందరు తృణమూల్‌కి, మరికొందరు బీజేపీకి మద్దతు ఇవ్వనున్నారు.
ప్రస్తుతం ప్రతి పొలిటికల్ పార్టీ కూడా మటువాలను బుజ్జగించి మంచి చేసుకు నేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ఫేజ్ –5 (మే 6)లో వీరి ప్రభావంగల సీట్లకు పోలింగ్ జరగనుంది. అసలు ఆసామాజిక వర్గం చరిత్ర ఏమిటి? మటువా మూమెంట్ ఎప్పుడు ప్రారంభమైంది? అనేవి ఆసక్తికరంగా మారాయి. మటువా ఉద్యమం పశ్చిమ బెంగాల్ లో 19వ శతాబ్దం చివర్లో మొదలైంది. మటువాలను ‘నామశూద్రులు’ అని కూడా అంటారు. వీళ్లు ఎస్సీ ల్లోని ఒక ఉపకులం. తూర్పు, మధ్య బెంగాల్ లోని బరిషాల్, ఫరీద్ పూర్, ఢాకా, ఖుల్నా, జెస్సో ర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయం ఈ కమ్యూనిటీ ప్రధాన వృత్తి.
చిత్తడి, అటవీ భూములను ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకొని ఆదర్శంగా నిలిచారు. తర్వాతి కాలంలో ఇతర కులాలు తమను చిన్న చూపు చూస్తున్నారనే భావన వాళ్లల్లో క్రమంగా మొదలైంది. అదే చివరికి సోష ల్ మూమెంట్ కి దారి తీసింది. ఈ పోరాటాన్ని తొలిసారిగా హరిచంద్ ఠాకూర్ ముందుండి నడిపారు. హరిచంద్ తర్వాత ఆయన కొడుకు గురుచంద్ ఠాకూర్ పగ్గాలు చేపట్టాడు. 1880, 90ల్లో మటువా మహా సంఘం అనే ఆర్గనైజేషన్‌కి రూపురేఖలు తెచ్చాడు. మటువాలు గ్రామీణ ప్రాంతాల వైష్ణవ సంప్రదాయాలను పాటించడంతో ఇతర కులాలవారు ఈ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. ఎస్సీలంతా ఏకతాటిపైకి రావాలని, చదువుకోవాలని, అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయికి ఎదగాలని గురుచంద్ అప్పట్లో ఉద్యమించారు.
దేశ విభజనతో దిక్కులేని స్థితికి…
దేశ విభజన మటువా కమ్యూనిటీకి ఏమాత్రం కలిసి రాలేదు. వాళ్లంతా తూర్పు పాకిస్థాన్‌కి వెళ్లాల్సివచ్చింది. ఈ కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్ పాకిస్థాన్‌లోని జిన్నా గవర్నమెంట్ లో మంత్రి కూడా అయ్యారు. కింది కులాల్లోని హిందువులకు తన సర్కారు ప్రాధాన్యత ఇస్తుందన్న జిన్నాహామీని మండల్ నమ్మారు. తర్వాత గానీ అసలు విషయం అర్థం కాలేదు. దీంతో ఠాకూర్ లాంటి కొందరు నేతలు తిరిగి పశ్చిమ బెంగాల్ కి వచ్చేశారు.
1950 అల్లర్ల అనంతరం మండల్ కూడా ఇండియాకి వలస వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి దృష్టంతా ఎస్సీల హక్కుల సాధన నుంచి శరణార్థుల పునరావాసం పైకి మళ్లింది. గూడుకోసం ఎస్సీలంతా దేశవ్యాప్తంగా చెల్లా చెదురయ్యారు. రెఫ్యూజీలను తొలుత ఆర్థిక భారంగా భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నాళ్ల తర్వాత దండకారణ్య లేదా అండమాన్ ప్రాంతాల్లోని డెవలప్ మెంట్ ప్రాజెక్టుల్లో ప్రొడక్టివ్ లేబర్ గా వాడుకోవాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రత్యేకంగా ఎప్పుడూ క్యాస్ట్ ఇష్యూస్ పై ఫోకస్ పెట్టలేదు.
రాజకీయ అధికారాల నిచ్చెనలో అన్ని పొలిటికల్ పార్టీలూ కింది కులాల నాయకులను ఒక స్థాయి వరకే రానిచ్చేవాళ్లు. అంతకుమించి ఎదగనిచ్చేవాళ్లు కాదు. దీంతో వాళ్లు టాప్ లెవల్ లో మచ్చుకైనా కనిపించేవాళ్లు కాదు. తొలుత హస్తం పార్టీ, ఆతర్వాత సీపీఎం ఈ సూత్రాన్నే ఫాలో అయ్యాయి. ఇప్పటి కీ అదే బాటలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ పాలి టిక్స్‌లో మటువా కమ్యూనిటీ హవా మళ్లీ ఎప్పుడా అనిదేశవ్యాప్తంగా ఎస్సీలు ఎదురు చూస్తున్నారు.
– ‘ది వైర్ ’ సౌజన్యంతో