- 320 చెక్‌పోస్టులు ఏర్పాటు
- సీఈసీ రాజీవ్‌కుమార్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్, డీజీపీ
హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలు, వాటి సరిహద్దు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఏసీ పాండే, అరుణ్ గోయెల్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రం నుంచి సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ సెక్రటేరియెట్ నుంచి వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు శాంతి కుమారి వివరించారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి చెక్ పోస్ట్ లను కట్టుదిట్టం చేశామన్నారు. ఇప్పటివరకు రూ.385 కోట్ల మేర నగదు జప్తు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని 17 సరిహద్దు జిల్లాల్లో 166 బార్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ సరిహద్దుల్లో పొరుగు రాష్ట్రాలు 154 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాయని తెలిపారు.
సరిహద్దు రాష్ట్రాలతో సమన్వయం కోసం డీజీపీ ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. నవంబర్ 28 నుంచి పోలింగ్ జరిగే 30వ తేదీ వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, సాధారణ నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ వివరించారు. ఇప్పటివరకు 182 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఏర్పాట్లపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ తేదీకి ముందే సరిహద్దులను మూసివేయాలని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాల సీఎస్‌లను ఆయన ఆదేశించారు.
ALSO READ : కేసీఆర్ స్కీమ్‌లపై అవగాహన కల్పించాలి : కల్వకుంట్ల కవిత