మంత్రి తలసానికి చెక్ పెడ్తరా! .. మినీ భారత్ సనత్​నగర్​లో గెలుపు ప్రతిష్టాత్మకం

  • దూకుడుగా బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ ప్రచారం
  • వలస నేత అని కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేయని పార్టీ స్థానిక నేతలు
  • అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్న  బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: అన్ని వర్గాల ప్రజలు అధికంగా ఉండే సనత్​నగర్​సెగ్మెంట్​ను మినీ భారత్​గా చెప్పొచ్చు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్​, సిక్కులు, జైనులు ఇక్కడ పెద్ద సంఖ్యలోనే ఉంటారు. దీంతో సనత్​నగర్​ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. 1989లో  సెగ్మెంట్​గా ఏర్పడగా  ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2014, 2018లో  బీఆర్ఎస్​ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్​యాదవ్ మంత్రి పదవిలో ఉన్నారు. సనత్​నగర్​లో పారిశ్రామిక వాడ కూడా ఉండడంతో ఇక్కడ కార్మికుల ఓట్లు బాగానే ఉన్నాయి. అమీర్​పేటలో సిక్కులు, సికింద్రాబాద్​లో మార్వాడీలు, క్రిస్టియన్లు, ఇతర వ్యాపారవర్గాలు అధికంగా ఉన్నాయి.  మూడోసారి ఎలాగైనా సనత్ నగర్​ సీటును దక్కించుకునేందుకు బీఆర్​ఎస్​ దూకుడు పెంచింది. ఇప్పటివరకు ప్రత్యర్థి పార్టీలు దరిదాపులకు కూడా రాలేదు.

వీరి ఓట్లతోనే గెలుపోటములు

 ఓటర్ల జాబితా సవరణ తర్వాత నియోజక వర్గంలో ప్రస్తుతం 2,44,946 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,27,436 మంది, మహిళా ఓటర్లు 1,17,502 మంది. అయితే.. బేగంపేట, పాటిగడ్డ, సనత్​నగర్​, రాంగోపాల్​పేట వంటి ప్రాంతాల్లో ముస్లింల ఓట్లు కీలకంగా ఉంటాయి. ఐడీహెచ్​కాలనీ, భోలక్​పూర్​, పాటిగడ్డ, బేగంపేట, మోండామార్కెట్​మురికివాడల్లో నివసించే ఓటర్లు అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేస్తుంటారు. ముఖ్యంగా సంజీవరెడ్డినగర్, అమీర్​పేట, పెండర్ ఘాస్ట్​రోడ్, సికింద్రాబాద్​ జనరల్​బజార్, రాణిగంజ్, కళాసిగూడ, జిర్రా వంటి ప్రాంతాల్లోని సంపన్నవర్గాల ఓట్లు కీలకంగా ఉన్నాయి. ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుని ఓట్లను సాధించుకున్న నేతకే ఇక్కడ విజయం దక్కే అవకాశముంది.

హ్యాట్రిక్ కోసం దూకుడు

సనత్​నగర్​ నుంచి పోటీలో నిలిచిన  బీఆర్ఎస్అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ ​యాదవ్​ హ్యాట్రిక్ కొట్టాలనే  పట్టుదలతో ఉన్నారు. 2 నెలల కిందటనే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా... అప్పటినుంచి  తన ప్రచార ఊపును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సెగ్మెంట్​ను రెండుసార్లు చుట్టివచ్చారు. ఈసారి తనకు పోటీ అంటూ ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. ఒక పక్క స్థానికంగా తనకున్న వ్యక్తిగత పలుకుబడి, పార్టీ కేడర్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తన విజయానికి కారణమవుతాయని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా  ఐడీహెచ్​కాలనీలో నిర్మించి డబుల్​ బెడ్​రూమ్​ఇండ్ల  సదుపాయం దేశానికి రోల్​మోడల్​గా నిలిచిందనిప్రశంసలు లభించాయి. సిటీలో  ఏ సెగ్మెంట్​లో ఇవ్వనన్ని డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లను తన నియోజక
వర్గంలో పేదలకు పంపిణీ చేశామని చెప్తున్నారు.  

వలస నేత అనే కారణంగా.. ​

 కొద్దిరోజులుగా సెగ్మెంట్​లో  వివిధ పార్టీల ప్రచార తీరును చూస్తే కాంగ్రెస్​ వెనకబడే ఉందనే వాదన ఉంది.  పైగా అభ్యర్థిని కూడా పెద్దగా ఓటర్లు గుర్తు పట్టడం లేదు. కోట నీలిమ పోటీ చేస్తారనేది కూడా ప్రచారంలో లేదు. ఇది ఆ పార్టీకి కొంత మైనస్​గా చెప్పొచ్చు. వలస నేత అనే కారణంతో స్థానిక కాంగ్రెస్​నేతలు కూడా పెద్దగా ఆమెకు సహకరించడం లేదు.  పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డితో ఒకసారి నిర్వహించిన సమావేశంతో  కోట నీలిమా ప్రజల్లోకి వెళ్లారు. టికెట్​రాకపోగా అసంతృప్తితో ఉన్న ముఖ్యనేతలు కూడా ఆమెకు సపోర్ట్​గా నిలవడం లేదనే సమాచారం. కాంగ్రెస్​కు అనుకూలాంశం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు. ప్రజల నిర్ణయమే ఆమెకు అనుకూలంగా మారే పరిస్థితి ఉంది.

ALSO READ: ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు : డీకే శివకుమార్​

ప్రచారంలో లేని కమలం

ఈసారి సనత్​నగర్​ నుంచి బీజేపీ  అభ్యర్థి గా మర్రి శశిధర్​ రెడ్డి పోటీలో నిలిచారు.  ఇప్పటి వరకు ఆయన  ప్రచారం ప్రారంభించ లేదు. కానీ, బస్తీలు, కాలనీల్లో స్థానిక నేతలను కలుస్తున్నారు.   తన తండ్రి మర్రి చెన్నారెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్​ నుంచి పోటీచేస్తూ మర్రిశశిధర్​రెడ్డి గెలుస్తూ వచ్చారు. కొంతకాలం కిందట కాంగ్రెస్​ను వీడి బీజేపీలో చేరారు. నియోజకవర్గ  సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. పలు సందర్భాల్లో మంత్రి తలసాని పాలన లోపాలపైనా విమర్శలు చేశారు.  ఇప్పడు మర్రిశశిధర్​ రెడ్డి అగ్నిపరీక్షనే ఎదుర్కొంటున్నారు. గతంలో ఆయనకు బలమైన క్యాడర్ ఉండేది. ప్రస్తుతం బీఆర్ఎస్​దే పైచేయిగా మారింది.