మండే ఎండలకు జీవవైవిధ్యంతో చెక్

మండే ఎండలకు జీవవైవిధ్యంతో చెక్

కాలుష్యం,  వాతావరణ మార్పు,  జీవవైవిధ్య  నష్టం.. ఈ మూడు  ప్రస్తుత  ప్రపంచం ఎదుర్కొంటున్న ఒకదానితో ఒకటి అనుసంధానమైన సమస్యలు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలంటే,  ఈ గ్రహం మీద ఆచరణీయ భవిష్యత్తును పొందాలంటే  మూడింటిని కలిపి పరిష్కరించాలి.  ముఖ్యంగా పెరుగుతున్న భూఉష్ణోగ్రతలకు ముఖ్య కారణం వాతావరణ మార్పు.  జీవవైవిధ్యం అనేది వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా..మానవులకు బలమైన సహజ రక్షణను కల్పిస్తోంది.  అందుకే భూమిపై  జీవవైవిధ్యం లేకుంటే  మనిషి జీవితం కొనసాగలేదు. ఈ విషయాన్ని గుర్తించిన  ఐక్యరాజ్యసమితి  జనరల్ అసెంబ్లీ  డిసెంబరు 2000 సంవత్సరంలో,  మే 22ని ‘అంతర్జాతీయ జీవవైవిధ్యం దినోత్సవం’ గా ప్రకటించింది.  2024వ సంవత్సర అంతర్జాతీయ జీవ వైవిధ్యం దినోత్సవం థీమ్ ‘ప్రణాళికలో భాగం అవ్వండి’.  

జీవవైవిధ్యం అంటే భూమిపై  నివసించే  వివిధ రకాల కోట్లాది జీవజాతులు.  భూమి ఒక అతి పెద్ద జీవావరణ వ్యవస్థ.  ఈ అతిపెద్ద  వ్యవస్థలో  అనేక ఇతర జీవ వ్యవస్థలు ఇమిడి ఉన్నాయి. వృక్షాలు, జంతువులు, మానవులు, సూక్ష్మజీవులు వంటి జీవజాతులు, గాలి, నీరు, సూర్యకాంతి, ఉష్ణోగ్రత తదితర కలయికతో  ఏర్పడిన వ్యవస్థను జీవావరణ వ్యవస్థ అంటారు. ఉదాహరణకు చెప్పాలంటే..  అడవి జీవావరణ వ్యవస్థ, నీటి జీవావరణ వ్యవస్థ, ఎడారి జీవావరణ వ్యవస్థ.  జీవావరణ వ్యవస్థలో సజీవులు (ప్రాణులు) గాని,  నిర్జీవులు (గాలి, నీరు)గాని లోపిస్తే జీవావరణ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది.  నీటి జీవావరణ వ్యవస్థలో  చేపలు సజీవులు, నీరు, ఆక్సిజన్ నిర్జీవులు. ఒకవేళ  నీరు నశించి పోయినట్లయితే నీటి జీవావరణ వ్యవస్థలోని చేపలు అన్ని చనిపోయి చివరికి ఆ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇదే విధంగా జీవవైవిధ్యం నశిస్తే  భూజీవావరణ వ్యవస్థలో మనిషి మనుగడ అసాధ్యం.  నేల,  సముద్రం  మొత్తం కార్బన్ ఉద్గారాలలో సగానికి పైగా గ్రహిస్తాయి.  అడవుల నరికివేత కారణంగా అమెజాన్  రెయిన్‌‌ ఫారెస్ట్‌‌ వంటి కార్బన్  ఉద్గారాలను  శోషించే  కేంద్రాలు ప్రస్తుతం కార్బన్ ఉద్గారాలను విడుదలచేసే కేంద్రాలుగా మారిపోతున్నాయి. 85 శాతం చిత్తడి నేలలు, ఉప్పు చిత్తడి నేలలు, పెద్ద మొత్తంలో  కార్బన్‌‌ను గ్రహించే మడ చిత్తడి నేలలు కనుమరుగు అవుతున్నాయి. 

ఉద్గారాలు

మానవ కార్యకలాపాలు  కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్‌‌హౌస్ వాయువులను ఉత్పత్తి  చేసినప్పుడు దాదాపు సగం ఉద్గారాలు వాతావరణంలోనే ఉంటాయి, మిగిలిన సగం భూమి, సముద్రం ద్వారా గ్రహించబడతాయి. ఈ పర్యావరణ వ్యవస్థలు అవి కలిగి ఉన్న జీవవైవిధ్యం  సహజ కార్బన్సింక్​లుగా పనిచేసి, వాతావరణ మార్పును అరికట్టడానికి ప్రకృతి  మనకు సమకూర్చిన వ్యవస్థగా పనిచేస్తాయి.  కార్బన్‌‌ను సంగ్రహించి నిల్వచేసే  సామర్థ్యం కలిగి ఉండటం వలన వాతావరణ మార్పును నివారించడంలో అడవులు కీలక పాత్ర వహిస్తాయి. 

జీవవైవిధ్యంతో ప్రపంచ ఆరోగ్యం

స్వచ్ఛమైన, సమర్థవంతమైన  పర్యావరణ వ్యవస్థలు స్వచ్ఛమైన గాలి, తాగునీరు, ఆహార భద్రతను కల్పిస్తాయి. అవి వ్యాధులు రాకుండా అరికడతాయి.  జీవ వైవిధ్యంపై నిర్వహించిన సమావేశం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా  ప్రచురించిన  నివేదిక ప్రకారం  జీవవైవిధ్య నష్టం తీవ్రస్థాయిలో జరుగుతోంది.  ఇది ప్రపంచవ్యాప్తంగా  మానవ ఆరోగ్యంపై  ప్రభావం చూపుతోంది. జీవవైవిధ్యం నశించి జూనోటిక్ వ్యాధులు జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.  లైమ్ వ్యాధి,  ఎబోలా  వైరస్,  హెచ్ఐవి, ప్లేగు,  రాబిస్ వైరస్ మొదలగునవి  జూనోటిక్ వ్యాధులకు కొన్ని ఉదాహరణలు.  అంటే వ్యాధి కారకాలు జంతువులలో ఉద్భవించి  మానవులకు  వ్యాప్తి చెందుతాయి.   ప్రపంచానికి సమస్యగా మారిన కరోనా వైరస్  మొదలైనవి జంతువులలో ఉండే వైరస్​లు.  ఇవి జంతువుల నుంచి మానవులకు సంక్రమిస్తాయి.  సార్స్ కరోనా  వైరస్ ‘సివెట్ పిల్లులు’ నుంచి మానవులకు సంక్రమిస్తే  మెర్స్ అనే వ్యాధి  ‘డ్రోమెడరీ ఒంటెల’ నుంచి మానవులకు వ్యాప్తి చెందుతుంది.  ప్రపంచ జీడీపీ సగానికిపైగా  ప్రకృతిపై ఆధారపడి ఉంది.  ఒక బిలియన్ కంటే  ఎక్కువమంది ప్రజలు తమ జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడి ఉన్నారు.  ఐక్యరాజ్యసమితి  పర్యావరణ  కార్యక్రమం  ప్రకారం  మానవ  కార్యకలాపాల వలన ఒక మిలియన్ జాతుల మొక్కలు, జంతువులు అదృశ్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.  డైనోసార్ల తర్వాత ఇదే అతిపెద్ద ప్రాణ నష్టం.  జీవవైవిధ్యంలో ఇతర జీవాలతో పాటుగా మానవుడు కూడా ఒక భాగమే. కానీ, జీవవైవిధ్యానికి మానవుని వల్లనే ఎక్కువ ముప్పు వాటిల్లుతున్నది.  జీవవైవిధ్యాన్ని రక్షించే, పునరుద్ధరించే ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేదు.  కేవలం మానవ సహకారం, జీవన శైలి మాత్రమే జీవవైవిధ్యాన్ని కాపాడగలదు.

ఎలా ప్రభావితం చేస్తోంది?

 భూమి ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్  పెరగడం వల్ల 4 % క్షీరదాలు తమ నివాసాలను కోల్పోతాయి.  2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత  పెరగడం వల్ల 8 % క్షీరదాలు తమ నివాసాలను కోల్పోతాయి,  3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత  పెరగడం వల్ల 41 % క్షీరదాలు తమ నివాసాలను కోల్పోతాయి.  సముద్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సముద్ర,  తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలకు కోలుకోలేని నష్టాన్ని పెంచుతాయి. ఉదాహరణకు,  పగడపు దిబ్బలు గత 150 సంవత్సరాలలో  దాదాపు సగానికి పడిపోయాయి.  సముద్రం మరింత వేడెక్కడం వలన దాదాపు మిగిలిన అన్ని పగడపు దిబ్బలు నాశనం అయ్యే ప్రమాదం ఉంది. సముద్ర ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరగడం వల్ల 70 నుంచి 90 % పగడపు దిబ్బలు అదృశ్యం అయ్యే అవకాశం ఉంది.  సముద్ర ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరగడం వల్ల 99 % పగడపు దిబ్బలు  అదృశ్యం అయ్యే అవకాశం ఉంది. 

- డా. శ్రీధరాల రాము 
ఫ్యాకల్టీ ఆఫ్  కెమిస్ట్రీ అండ్
ఎన్విరాన్మెంటల్ సైన్సెస్