చత్తీస్‌గఢ్ పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేది మావోయిస్టులే. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా వీరి కదలికలు కనిపిస్తుం టాయి. ఇక్కడ ఆదివాసీల జనాభా ఎక్కువ. ప్రభుత్వం పట్ల వీళ్లలో ఉన్న అసంతృప్తిని వేదికగా చేసుకుని ఇన్నేళ్లుగా చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బలపడ్డారు. ఇప్పుడు వాళ్ల బాటలో నడవడానికి ట్రైబల్స్ ఇష్టపడడం లేదు. ప్రభుత్వం తీసుకున్న ‘విశ్వాస్, వికాస్, సురక్ష’ వైపు మళ్లుతున్నారు.
మావోయిస్టులకు అడ్డా లాంటిది సౌత్ చత్తీస్‌గఢ్‌లో ఉన్న బస్తర్ ప్రాంతం. ఈ ప్రాంతంలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు వాళ్లు చెప్పిందే వేదం. అన్నలు తమ దారికి రాని గిరిజనుల్ని నయానో భయానో లొంగదీసుకునేవారు. వీళ్ల పవర్‌కి చెక్ పెట్టడానికి ప్రభుత్వం మూడు అంశాల వ్యూహం ‘విశ్వాస్, వికాస్, సురక్ష’ ప్రయోగిస్తోంది. ఇందులో భాగంగా జగదల్పూర్ జిల్లాలోని రాణి బొడ్లి అనే ఊళ్లో ఈ మధ్యనే పోలీసులు క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం సాగుతోంది. దీనిని సూపర్ వైజ్ చేయడం కోసం క్యాంపు ఏర్పాటైంది. రోడ్డు పూర్తయితే చుట్టుపక్కల పల్లెలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలేర్పడతాయి. గిరిజనుల పంటను అమ్ముకోవడానికి, విద్య వైద్యం వగైరాలు పొందడానికి వీలు కలుగుతుంది.
బొడ్లి క్యాంపు ఉన్న ఊరు, మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న ఐదు జిల్లాలకు సరిహద్దు ప్రాంతం. బస్తర్, దంతేవాడ, బీజాపూర్, నారాయణ్‌పూర్, కొండగావ్ జిల్లాలకు చెందిన దాదాపు 40 పల్లెలు ఈ క్యాంప్ పరిధిలోకి వస్తాయి. నిజానికి బొడ్లి క్యాంపు ఉన్న గ్రామం స్టేట్ హై వేలో ఉంది. చత్తీస్‌గఢ్ కేపిటల్ రాయ్‌పూర్‌కు 350 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. స్టేట్ హై వే కావడంతో ఒకప్పుడు వాహనాల రాకపోకలతో, వచ్చే పోయే జనంతో కళకళలాడుతూ ఉండేది. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట నక్సల్ యాక్టివిటీ పెరగడంతో కళ తప్పింది. మావోయిస్టుల భయంతో సాయంత్రమవగానే చుట్టుపక్కల ప్రజలు ఇళ్లు దాటేవారు కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంభయంగా గడిపేవారు. లేటెస్ట్గా పోలీసు క్యాంపు పెట్టడంతో కొంత రిలీఫ్‌గా ఫీలవుతున్నారు. ఒకప్పటి రోజులు మళ్లీ వస్తాయని, బిజినెస్ పరంగా తమ ప్రాంతం అభివృద్ది చెందుతుందని ఆశిస్తున్నారు.
బొడ్లి క్యాంపుని అభివృద్ధికి నమూనాగా చెబుతున్నారు బస్తర్ ఐజీ సుందర్ రాజ్. మావోయిస్టులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం మూడు అంశాల వ్యూహం (విశ్వాసం, అభివృద్ది, భద్రత) పన్నింది. అందులో భాగమే ఈ బొడ్లి పోలీసు క్యాంపు. దీనికి అనుబంధంగా అడవి బిడ్డల కోసం రేషన్ షాపు, అంగన్వాడి సెంటర్, స్టూడెంట్స్ కోసం హాస్టల్ కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటితో పాటు హెల్త్ క్యాంపు కూడా ఏర్పాటు చేసి గిరిజనుల ఆరోగ్యానికి ప్రయారిటీ ఇచ్చారు. గ్రామస్తులకోసం బోరు బావులుకూడా తవ్వించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని జనాలు ఈ క్యాంప్ ద్వారా జరుగుతున్న సర్వీసుని చూసి తమకు కూడా కావాలంటున్నారు. దీంతో పల్లి బర్సూరు కేంద్రంగా మరో ఆరు సెక్యూరిటీ క్యాంప్‌లు పెట్టాలని నిర్ణయించారు. ఇవన్నీ మొత్తంగా 54 కిలోమీటర్లను కవర్ చేస్తాయి. వీటన్నింటికీ కూడా బొడ్లి క్యాంప్ సెంటర్ పాయింట్‌గా ఉంటుంది.
బస్తర్‌లో ఇప్పుడు పరిస్థితులు బాగా మారిపోయాయి. అక్కడి జనాలు శాంతి కోరుకుంటున్నారు. గిరిపుత్రుల కోసం ప్రభుత్వాలు అనేక రకాల సంక్షేమ పథకాలను రూపొందించి వాటిని సక్సెస్ ఫుల్‌గా అమలు చేశాయి. ఇటీవల ఏర్పాటైన రాణి బొడ్లి క్యాంపును కూడా ఈ కోణంలో నుంచే చూడాలి.
మావోయిస్టుల హవా తగ్గింది
చత్తీస్‌గఢ్‌కు మావోయిస్టు కార్యకలాపాలు కొత్త కాదు. మందుపాతరలు పెట్టి పోలీసుల ప్రాణాలు తీసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. వాటిలో రాణి బొడ్లి క్యాంపుపై దాడి చేసిన సంఘటన, మావోయిస్టుల ఘాతుకాల్లో చాలా పెద్దది. 2007 మార్చి 15న జరిగిన ఈ సంఘటనలో 55 మంది పోలీసులు చనిపోయారు. దీని తర్వాత ఆ ప్రాంతమంతా మావోయిస్టుల చేతిలోకి వెళ్లింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య చాలాసార్లు ఎన్కౌంటర్లు జరిగాయి. ప్రభుత్వం అండదండలతో లోకల్ ఎమ్మెల్యే మహేంద్ర కర్మ ‘సల్వా జుడుం’ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసి, మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీలను కూడగట్టారు. ఆరేడేళ్లపాటు సల్వా జుడుం, మావోయిస్టులు ఒకరిపై ఒకరు హింసకు పాల్పడ్డారు. 2013లో దర్భా లోయలో మందుపాతరలు పేల్చి మహేంద్ర కర్మను మరికొందరిని మావోయిస్టులు హతం చేశారు. అయితే, రమణ్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆదివాసీల్లో చాలా మార్పు వచ్చింది. ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల్ని పొందాలన్న ఉద్దేశం పెరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాగానీ, మావోయిస్టులు ట్రైబల్ లొకాలిటీల్లో పుంజుకునే ఛాన్స్ లేదంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ ప్రోగ్రాంలకు గిరిజనులు పూర్తిగా సహకరిస్తున్నారు.