Viral Video: రియల్ హీరో..ఉత్త చేతులతోనే పులిని చంపిండు

Viral Video: రియల్ హీరో..ఉత్త చేతులతోనే పులిని చంపిండు
  • యూపీలో మాజీ సోల్జర్ పోరాటం

బిజ్నోర్(యూపీ): పొలం పనిచేసుకుంటున్న ఓ మాజీ సైనికుడిపై చిరుత దాడి చేసింది. అయితే, ఆ 55 ఏండ్ల మాజీ సైనికుడు బెదరలేదు. చిరుతను ఎదిరించాడు. ఏడెనిమిది నిమిషాలు ఉత్తచేతులతోనే పోరాడి పులిని మట్టికరిపించాడు. ఈ పోరాటంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్​లోని బిజ్నోర్ ​జిల్లా భిక్కవాలా గ్రామంలో మాజీ సోల్జర్ తేజ్ వీర్ సింగ్ కు ఎదురైందీ భయానక అనుభవం. తీవ్రంగా గాయపడ్డ నేగీ ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

రక్తం కారుతున్నా పిడిగుద్దులు ఆపలే..  

తేజ్​వీర్ సింగ్ నేగి గురువారం తన పొలంలో పనులు చేసుకుంటుండగా చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. సమయానికి చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోవడంతో తేజ్ వీర్ ఉత్త చేతులతోనే చిరుతను ఎదుర్కొన్నాడు. మెడ, గొంతు భాగాన్ని దొరకబుచ్చుకుని తనను ఈడ్చుకెళ్లేందుకు పులి చేస్తున్న ప్రయత్నాలను ఓ చేతితో అడ్డుకుంటూ మరో చేతితో దానిపై పిడి గుద్దులు కురిపించాడు. 

ఓపక్క తన మెడ నుంచి రక్తం కారుతున్నా దాడి ఆపలేదు. తీవ్రమైన పోరాటం మధ్య చిరుత పొదల్లోకి గుంజుకెళ్తుండగా ఓ కర్రను పట్టుకున్నాడు. దానినే ఆయుధంగా మార్చుకుని చిరుత ముఖంపై పదేపదే కొట్టడంతో దాని పట్టు కాస్త సడలింది. అదేవేగంతో కర్రతో నేగీ కొట్టిన దెబ్బలకు పులి కుప్పకూలిపోయింది. ఒంటినిండా రక్తంతో నేగీ కూడా సోయితప్పి పడిపోయాడు. 

ఇదంతా ప్రత్యక్షంగా చూసిన తోటి కూలీలు పోలీసులకు సమాచారమివ్వగా, వాళ్లు వెళ్లి మాజీ సైనికుడు నేగీని ఆస్పత్రిలో చేర్పించారు.  పులి మృతదేహాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పులి వయసు నాలుగేండ్లు ఉంటుందని, బరువు 120 కిలోలుందని తెలిపారు. నేగీకి ట్రీట్​మెంట్ కొనసాగుతోందని చెప్పారు. బిజ్నోర్ గ్రామం సహా చుట్టుపక్కల ఏరియాలో పులుల దాడుల్లో ఏడాదిన్నర కాలంలో 26 మంది చనిపోయారు.