చిరుతను చంపిన ముళ్ల పంది!

చిరుతను చంపిన ముళ్ల పంది!
  • నారాయణపేట జిల్లా జాదవరావుపల్లి శివారులో ఘటన 
  • నిర్ధారించిన ఫారెస్ట్  ఆఫీసర్లు 

మద్దూరు, వెలుగు : నారాయణపేట జిల్లా మద్దూ రు మండలం జాదవరావుపల్లి శివారులో ముళ్ల పంది దాడి చేయడంతో చిరుత చనిపోయింది. గ్రామ శివారులోని తాటిగట్టు సమీపంలోని రాయం చెరువు వద్ద గురువారం రాత్రి చిరుత పులి చనిపోయినట్లు గుర్తించిన గ్రామస్తులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ నాయక్​కు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖాధికారులు శుక్రవారం చిరుత మరణించిన స్థలానికి చేరుకొని డెడ్​బాడీని  పరిశీలించారు.

పులి చనిపోయి మూడు రోజులవుతోందని, డెడ్ బాడీకి ముళ్ల పంది ముళ్లు గుచ్చుకొని ఉన్నాయని గుర్తించారు. దీంతో ముళ్ల పంది దాడిలోనే చిరుత చనిపోయి ఉంటుందని నిర్ధారించారు. పోస్ట్ మార్టం కోసం మహబూబ్ నగర్  వెటర్నరీ సర్జన్ ​దవాఖానకు చిరుత కళేబరాన్ని తరలించారు. రిపోర్ట్  ఆధారంగా త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కాగా, శివార్లలో నాలుగుకు పైగా చిరుత పులులు సంచరిస్తున్నాయని, పొలాలకు పోవాలంటనే భయంగా ఉందని

తొందరగా వాటిని పట్టుకోవాలని గ్రామస్తులు ఫారెస్ట్​ ఆఫీసర్లను కోరారు. కాగా, జూన్  నెలలో మద్దూరు మండలంలోని నందిపాడ్, జాదరావ్ పల్లి శివార్లలో చిరుత అనుమానాస్పద స్థితిలో చనిపోగా, ఆరు రోజుల తర్వాత మరో చిరుత ఫారెస్ట్ ఆఫీసర్ల  బోనుకు చిక్కింది.