అమ్మో చిరుత.. శ్రీశైలంలో కలకలం.. కుక్క కోసం ఎలా వచ్చిందో చూడండి..

నంద్యాల: శ్రీశైలంలో తెల్లవారుజామున చిరుత పులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగ మార్గంలోని దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వెనుక చిరుత సంచరించింది. ఇంటి ప్రహరీ గోడపై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లేందుకు చిరుత ప్రయత్నించింది. చిరుతపులి సంచరించిన దృశ్యాలు  సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిరుతపులి సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో చిరుత పులి కనిపించడంతో శ్రీశైలంలో దైవ దర్శనానికి వెళ్లిన భక్తులు కూడా కలవరపాటుకు లోనవుతున్నారు. ఇటీవల.. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో సందర్శకులు భారీగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ చాలా మంది భక్తులు శ్రీశైలంలోనే ఉన్నారు. చిరుత పులి వార్తలతో భక్తుల్లో టెన్షన్ మొదలైంది. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటవీ శాఖ అధికారులు చెప్పారు.

చిరుత పులి పాతాళ గంగ మార్గంలో కనిపించడం ఇది కొత్తేం కాదు. జులైలో పాతాళ గంగ పాత మెట్ల మార్గం వైపు చిరుత పులి కనిపించింది. పాత మెట్ల మార్గం ఆనుకుని ఉన్న ప్రాంతంలో చిరుత పులి అడవి నుంచి రోడ్డు మీదకు వచ్చింది. దీంతో అటుగా వెళ్లిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. చిరుతపులి దాదాపు అర గంట సేపు డివైడర్పై కూర్చుని అటూఇటూ చూసింది. ఈ దృశ్యాన్ని స్థానికులు తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

అర గంట తర్వాత చిరుత పులి తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు ఎక్కువగా తిరుగుతూ ఉండే ప్రాంతంలో చిరుత పులి అడవి నుంచి బయటకు వచ్చి కనిపించడంతో భయం నెలకొంది. పాతాళ గంగ ప్రాంతంలో చిరుత పులి ఇప్పటికి చాలాసార్లు కనిపించింది. అటవీ శాఖ అధికారులు డోలు శబ్దాలు చేయించడంతో కొన్నాళ్లు కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు ఏఈవో ఇంటి వెనుక కనిపించడంతో స్థానికులు టెన్షన్ పడుతున్నారు.