మద్దూరులో చిరుత పులుల కలకలం..

మద్దూరులో చిరుత పులుల కలకలం..

మద్దూరు, వెలుగు: నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఓ చిరుతపులి అటవీశాఖాధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కగా, మరో చిరుత కళేబరం ఓ పొలంలో కనిపించింది. నెల రోజుల నుంచి మండలంలోని నందిగామ, మల్కిజాదరావుపల్లి గుట్టల ప్రాంతంలో ఐదు నుంచి ఆరు చిరుతలు సంచరిస్తున్నాయి. 

ఏదో ఒకచోట ఆవులు, గేదెలను చంపి తింటున్నాయి. దీంతో నందిగామ ప్రజలు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రెండు వారాలుగా పులుల కోసం గాలిస్తున్నారు. సోమవారం వాటి పాదముద్రల గుర్తులను సేకరించి, నాలుగైదు చిరుతలున్నట్లు భావించారు. సోమవారం సాయంత్రం కాటరాల గుట్ట వద్ద బోను ఏర్పాటు చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఓ చిరుత అందులో చిక్కింది. ఫారెస్ట్ ఆఫీసర్లు సదరు చిరుతను అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​కు తరలించారు.

పొలంలో చిరుత కళేబరం..

నందిగామ సమీపంలోని మల్కిజాదరావుపల్లి శివారులోని గుబ్బడిగుట్ట సమీపంలో ఓ రైతు పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం రైతు హన్మంతు రావు తన చేనులో వరి కోతలు కోయడానికి మెషీన్​ తీసుకెళ్లాడు. చేనులో చిరుత చనిపోయి ఉండటాన్ని చూసి, ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారమిచ్చాడు. వారు వచ్చి చిరుతను పోస్టుమార్టం కోసం మహబూబ్​నగర్​ తరలించారు. చిరుత చనిపోయి ఐదు రోజులై ఉంటుందని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. మృతికి కారణాలను పోస్టుమార్టం నివేదిక తర్వాత స్పష్టం చేస్తామని వివరించారు.