హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మియాపూర్ ఎంత రద్దీ ఏరియానో నగరవాసులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి మియాపూర్లో చిరుత పులి సంచరించిందంటే నమ్మగలరా..? మియాపూర్లో చిరుత తిరగడం ఏంటని కొట్టిపారేస్తారేమో. మియాపూర్ మెట్రో స్టేషన్ సాక్షిగా ఇది అక్షరాలా నిజం. మియాపూర్లో చిరుత సంచారం కలకలం రేపింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది.
మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల చిరుత సంచారం.. pic.twitter.com/eGjurv8bRC
— Mr. Mohan (@kundenapally_12) October 18, 2024
చిరుత సంచరిస్తుండగా కొందరు ఆ దృశ్యాలను వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు స్పాట్కు చేరుకుని చిరుత సంచారంపై ఆరా తీశారు. ఆ వీడియోలో కనిపించింది లియోపార్డ్ గానీ జాగ్వార్ గానీ అయి ఉండొచ్చని చీతా కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మన దేశంలో చీతాలు కేవలం వైల్డ్ ఫారెస్ట్ల్లో మాత్రమే ఉంటాయని చెప్పుకొచ్చారు. అది ఏ జాతి పులి అయినప్పటికీ మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో సంచరించడం నగరవాసుల్లో భయాందోళనకు కారణమైంది.
హైదరాబాద్ నగర శివార్లలో చిరుత సంచారం కొత్తేమీ కాదు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్ వేపై 2024, మే నెలలో చిరుత కనిపించి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. రన్‌వేపై చిరుతను గమనించిన పెట్రోలింగ్ సిబ్బంది, ఎయిర్‌పోర్ట్ అధికారులు అటవీ శాఖకు సమాచారం అందించారు. దీంతో చిరుతను పట్టుకునేందుకు ఐదు రోజులు అధికారులు గస్తీ ఆపరేషన్ నిర్వహించారు. చిరుత ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో 25 అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకునేందుకు మేకలను ఎరగా వేసి 5 బోన్లను ఏర్పాటు చేశారు. మేకను ఎరగా వేయగా తినేందుకు బోనులోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కుకుపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి చిరుతను నెహ్రూ జూ పార్క్ తరలించారు.