జీడిమెట్ల లో కెమికల్ డ్రమ్ములు లీకై ఉక్కిరిబిక్కిరి

  • ముగ్గురు ఫైర్​ సిబ్బందికి అస్వస్థత
  • జీడిమెట్ల ఇండస్ట్రియల్ లో ఘటన

జీడిమెట్ల, వెలుగు : కెమికల్​డ్రమ్ములు లీకై ఓ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన జీడిమెట్ల ఇండస్ట్రియల్​ ఏరియాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల ఇండస్ట్రియల్​ఏరియాలోని ఫేజ్-1, ప్లాట్​నంబర్ 13లో శ్రీశ్రీ కెమికల్స్​ కంపెనీని శ్రీకాంత్​అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు.  ఆదివారం రాత్రి నిల్వ ఉంచిన కెమికల్ డ్రమ్ములు లీకై ముందుగా ఘాటైన వాసనలు వచ్చాయి. దీంతో స్థానికులకు శ్వాస తీసుకోవడం కష్టమై ఉక్కిరిబిక్కిరయ్యారు. అనంతరం కెమికల్ డ్రమ్ములు పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి.

ALSO READ : పదేండ్లలో జరిగింది అభివృద్ధి కాదు..అవినీతి: పౌరసమాజం

దీంతో జీడిమెట్ల సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ ఘాటైన వాసనలు వెలువడడంతో ఫైర్​ సిబ్బందికి కూడా శ్వాసతీసుకోవడం కష్టంగా మారింది. దీంతో ముగ్గురు సిబ్బంది అస్వస్థతకు గురవగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం జీడిమెట్ల ఫైర్​ఆఫీసర్​ సుభాశ్​రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.  నిబంధనలు పాటించని పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.