ఫార్మా కంపెనీలో కెమికల్ లీక్

  • నలుగురు కార్మికులకు అస్వస్థత 

భూదాన్ పోచంపల్లి, వెలుగు : సాయితేజ ఫార్మా కంపెనీలో కెమికల్ లీకేజ్ కావడంతో నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని సాయితేజ ఫార్మా కంపెనీలో శనివారం సాయంత్రం ఎసిటో నైట్రేట్ ఫార్ములాను ఛతీస్​గఢ్​కు చెందిన నలుగురు కార్మికులు లోడ్ చేశారు. రాత్రి డ్యూటీ ముగించుకొని కంపెనీ క్వార్టర్స్ లోనే కార్మికులు నిద్రించారు. ఆదివారం ఉదయం ఆ నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.

విషయం తెలుసుకున్న కంపెనీ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా అస్వస్థతకు గురైన వారిని హైదరాబాద్ లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అస్వస్థతకు గురైనవారిలో మున్నాలాల్ అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భాస్కర్​రెడ్డి సాయి తేజ ఫార్మా కంపెనీకి వెళ్లి పరిశీలించారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు.