ఫ్యాక్టరీలో కెమికల్ లీకేజీ : 11 మంది కార్మికులకు అస్వస్థత

యాదాద్రి జిల్లా : చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం పరిధిలోగల శ్రీ జయ కెమికల్ ఫ్యాక్టరీలో జూలై 11న రాత్రి కెమికల్ లీకేజీ  జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఈ ఘటనలో 11 మంది కార్మికులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎనిమిది మందిని హుటాహుటిన వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండడంతో ఐసియు లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.  
నాలుగు నెలలు క్రితం కూడా ఈ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తికి తీవ్ర అస్వస్థత గురై శ్వాస తీసుకోలేక మృతి చెందాడు. ఆ ఘటన జరిగి మరవకముందే మళ్లీ 11 మందికి తీవ్ర అస్వస్థకు గురవడంతో కంపెనీ ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ మెయింటైన్ చేయడం లేదని బాధిత కుటుంబ సభ్యులు మరియు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి కూడా ఈ ఘటనపై కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.