శవాలను వాడే కెమికల్ ను పాలల్లో కలుపుతున్నారు. యాదాద్రి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. శవాలను భద్రపరచడానికి వాడే కెమికల్ ను పాలలో కలుపుతున్నట్లు తేలింది. బీబీనగర్ మండలం కొండమడుగులో ప్రైవేట్ పాల సేకరణ సెంటర్ లో పాలను టెస్ట్ చేయటంతో అసలు నిజం బయటపడింది. శవాలను భద్రపరచడానికి వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను పాలల్లో ఉపయోగిస్తున్నట్లు తేలింది. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా పగిలిపోకుండా ఉండేందుకు ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను వాడుతున్నట్లు పాల సేకరణ సెంటర్ నిర్వాహకుడు కడెం కుమార్ యాదవ్ అధికారుల ఎదుట అంగీకరించారు. ఈ కేంద్రానికి రోజూ 600 లీటర్లకు పైగా పాల సరఫరా జరుగుతుంది. కుమార్ యాదవ్ పాలలో నీళ్లతో పాటు సుక్రోజ్, అమ్మోనియం సల్ఫేట్‌ను కలి పి ఎక్కువ పాలు తయారు చేస్తున్నాడని అధికారులు తెలిపారు. ఆ పాలను ప్యాక్ చేసి స్థానికంగా విక్రయిస్తూ హైదరాబాద్‌లోని హోటల్స్‌కు తరలిస్తున్నాడు. దీంతో కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. అతనిపై ఎలాంటి కేసులు పెట్టవద్దని ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లకు బీబీనగర్ మండలానికి చెందిన ఓ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఫోన్ చేసినట్లు తెలిసింది. పర్మిషన్ లేకుండా పాల వ్యాపారం చేస్తున్న మరో ఇద్దరిపైనా కేసు ఫైల్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురంలో ఇటీవల కల్తీ పాల తయారీ వెలుగులోకి వచ్చింది. . దీంతో బుధవారం బీబీ నగర్‌లోని టోల్గేట్ వద్ద ఎస్ఐ సహకారంతో యాదాద్రి జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌కు పాలు తరలిస్తున్న వాహనాలను ఆపి శాంపిల్స్ సేకరించారు. ‘మొబైల్ టెస్టింగ్ ఫుడ్ లేబరేటరీ’లో ఆ శాంపిల్స్ ను టెస్టు చేశారు. లైసెన్స్ లేకపోవడంతో పాటు కల్తీ పాలను హైదరాబాద్‌కు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.
దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం
శవాలు భదపర్చడానికి వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్కలిపిన పాలను ఉపయోగిస్తే వెంటనే ముప్పు లేకున్నా.. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదముందని అధికారులు తెలిపారు. శ్వాస, జీర్ణకోశ, కాలేయ సంబంధమైన వాధులతో పాటు మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వారు హెచ్చరించారు.
పీడీ యాక్ట్ నమోదు చేయిస్తం
పాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వి.స్వాతి హెచ్చరించారు. క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయిస్తామని వారు తెలిపారు.