మామిడిని మగ్గబెట్టేందుకు యథేచ్ఛగా కెమికల్స్​...

  • నిషేధమున్న విరివిగా ఎథేపాన్​ వాడకం
  • తూతూమంత్రంగా ఆఫీసర్ల తనిఖీలు
  • సూర్యాపేట జిల్లాలో ఏటా రూ. కోటి విలువైన ఎథేపాన్​వినియోగం
  • చక్రం తిప్పుతున్న మార్కెట్​సెక్రటరీ

సూర్యాపేట వెలుగు:  ప్రజలు ఎంతో ఇష్టంగా తినే మామిడి పండ్లను కొందరు వ్యాపారులు స్వలాభం కోసం విషంగా మారుస్తున్నారు. మామిడి మగ్గడానికి 5 రోజులు పడుతుంది. కానీ ఒక్కరోజులోనే వాటిని మగ్గబెట్టేందుకు సూర్యాపేట జిల్లాలో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఫుడ్​సేఫ్టీ రూల్స్ పక్కనపెట్టి ఎథేపాన్ కెమికల్ వాడుతున్నారు. దీని వాడకంతో మామిడి కాయలు ఒక్కరోజులోనే మగ్గి, ఎల్లో కలర్ లో నిగనిగలాడుతున్నాయి. కానీ దీని వాడకం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది.

విచ్చలవిడిగా వాడకం..

కాయలను మగ్గబెట్టేందుకు సహజ పద్ధతులు ఉన్నాయి. వాటి వల్ల లేట్ అవుతోందని వ్యాపారులు ఆ పద్ధతులను పాటించడం లేదు. ఎథేపాన్​పౌడర్ వాడకంతో కాయ ఒక్కరోజులోనే మగ్గడం, ఎల్లో కలర్ లో మెరుస్తుండడంతో దీన్ని వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా పెద్ద ఎత్తున ఈ కెమికల్స్​సూర్యాపేట తరలిస్తున్నారు. జిల్లాలో యేటా రూ.కోటి విలువైన ఎథేపాన్ వాడుతున్నారు.  చిన్నచిన్న పాకెట్లలో ఉన్న ఈ పౌడర్​ను ముందుగా నీటిలో ముంచి, మామిడి కాయల బాక్స్​లో వేసి ప్యాక్ చేస్తున్నారు. నీళ్లలో ముంచిన ఆ కెమికల్స్​ వల్ల ఒక్కరోజులోనే కాయలు మొత్తం పండ్లుగా 
మారుతాయి.

బహిరంగంగానే వ్యవహారం 

మార్కెట్ లో ఈ కెమికల్​ బహిరంగంగానే జరుగుతున్నా, పట్టించుకొనే వారు కరువయ్యారు. కాల్షియం కార్బేడ్, ఎథేపాన్, బిగ్ పాన్ లాంటి కెమికల్స్ తో పాటు చైనా నుంచి వస్తున్న కెమికల్స్ చల్లి మామిడి రంగు మారుస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ ప్రకారం 20 కే‌జీల బాక్స్​లో 5 గ్రాముల ఇథిలిన్ మాత్రమే వాడాలి. అది కూడా మామిడి పండ్లకు  డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా చిన్న బాక్స్​లో పెట్టి పండ్ల మధ్యలో ఉంచాలి. కానీ వ్యాపారులు ఇవేవీ పట్టించుకోకుండా ఒక్కో మామిడిపండ్ల బాక్స్​లో 6 నుంచి 8 ఎథేపాన్​ప్యాకెట్లు వాడుతున్నారు. ఇలాంటి వారిపై ఆఫీసర్లు నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఉన్నా..  శాంపిల్స్ పేరుతో హడావుడి చేస్తున్నారే తప్ప వ్యాపారులపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు.

డిస్ర్టిబ్యూటర్​గా మారిన మార్కెట్​సెక్రటరీ

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ మామిడి పండ్ల మార్కెట్ కు ఎథేపాన్​ప్యాకెట్ల సప్లయ్ కోసం డిస్ట్రిబ్యూటర్ అవతారం ఎత్తాడు. మార్కెట్ లోని ఓ వ్యాపారి పేరుపై లైసెన్స్ తీసుకొని, పెద్ద ఎత్తున ఎథేపాన్​సప్లయ్​చేస్తున్నాడు. 

మామిడి ట్రేడర్లతో  కుమ్మక్కై తనిఖీల సమయంలో ఆఫీసర్లు ఎలాంటి కేసులు నమోదు చేయకుండా ట్రేడర్లను కాపాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఇందుకు మామిడి మార్కెట్ వ్యాపారుల నుంచి ప్రతీనెల పరోక్షంగా ఆ అధికారికి భారీగా ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఏ మార్కెట్ సెక్రటరీ ఈ తరహా వ్యాపారం చేయలేదని, అధికారి స్థానంలో ఉండి నేరుగా ఇలా చీకటి వ్యాపారం చేయడం పట్ల విమర్శలు 
వెల్లువెత్తుతున్నాయి. 

శాంపిల్స్ టెస్టింగ్ కు పంపాం

మామిడిపండ్లను మగ్గబెట్టేందుకు కెమికల్స్ వాడే వారిపై చర్యలు తీసుకుంటాం. మామిడి శాంపిల్స్ టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపించాం. రిపోర్ట్ ఆధారంగా వ్యాపారులపై చర్యలు చేపడతాం.  
- కల్యాణ్ చక్రవర్తి, 
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సూర్యాపేట