కేఎఫ్​సీలో ఆయిల్​ ప్యూరిఫై కోసం కెమికల్స్

కేఎఫ్​సీలో ఆయిల్​ ప్యూరిఫై కోసం కెమికల్స్
  •  మెగ్నీషియం సిలికేట్ సింథటిక్​ను వాడుతున్నట్టు గుర్తించిన ఆఫీసర్లు
  • తమిళనాడులో ఔట్​ లెట్ సీజ్​

చెన్నై: తమిళనాడులోని తూత్తుకూడి వేలావన్​ మార్కెట్​లోని కేఎఫ్​సీ యూనిట్​ లైసెన్స్​ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సస్పెండ్​ చేశారు. కేఎఫ్​సీ యూనిట్​లో వినియోగించిన ఆయిల్​ను ప్యూరిఫై చేసేందుకు మెగ్నీషియం సిలికేట్​ సింథటిక్స్​ను కలుపుతున్నట్టు గుర్తించి, ఈ చర్యలు తీసుకున్నారు. “వేలావన్​ హైపర్ ​మార్కెట్​లోని కేఎఫ్​సీ ఔట్​లెట్​లో ఆకస్మిక తనిఖీ చేశాం. నూనెను శుద్ధి చేసేందుకు ఎఫ్ఎస్ఎస్​ఏ నిబంధనలకు విరుద్ధంగా సింథటిక్స్​ను వాడుతున్నారు.

 18 కిలోల సింథటిక్​ మెగ్నీషియం సిలికేట్, 45 లీటర్ల వాడిన నూనెను పట్టుకున్నాం. వీటితోపాటు 12 గంటల కింద ఫ్రై చేసిన 56 కిలో చికెన్​ను స్వాధీనం చేసుకొని పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపించాం” అని ఫుడ్​ సేఫ్టీ అధికారి తెలిపారు. ​అలాగే, కృత్రిమ రంగులు వినియోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పానీపూరీ  సెంటర్లలో కూడా తనిఖీలు చేపట్టామని, పానిపూరీ, మసాలకు సంబంధించిన మూడు శాంపిల్స్​ సేకరించి ల్యాబ్​కు పంపామని తెలిపారు. 

 అధికారులు ఇచ్చే రిపోర్ట్​ ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా తమ ఔట్​లెట్స్​లో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు అనుగుణంగానే ఆయిల్, చికెన్​ వాడుతున్నామని కేఎఫ్​సీ ఒక ప్రకటనలో పేర్కొన్నది.