నల్లమల నుంచి చెంచుల తరలింపు

నల్లమల నుంచి చెంచుల తరలింపు
  • పైలెట్​ ప్రాజెక్టుగా కొల్లంపెంట  
  • కుటుంబానికి రూ. 15 లక్షల ప్యాకేజీ 
  • యురేనియం వెలికితీతకే తరలిస్తున్నారనే ఆరోపణలు

నాగర్​కర్నూల్, వెలుగు: నల్లమల టైగర్​రిజర్వ్​ఫారెస్ట్​లోని కోర్​ఏరియా నుంచి చెంచులను తరలించే ప్రయత్నాలు స్పీడందుకున్నాయి. పులులు ఏయే పెంటల్లో ఎక్కువగా తిరిగే అవకాశాలుంటాయో ఆ ప్రాంతం నుంచి చెంచులు, గిరిజనులు, గిరిజనేతరులను ఖాళీ చేయించాలనే ప్రయత్నాలు కొన్నేండ్లుగా సాగుతున్నాయి. గతంలో సార్లపల్లి, కుడిచింతల బైలు, కొల్లంపెంట చెంచు పెంటలు, వట్వర్లపల్లి గ్రామాలను తరలించేందుకు ఆఫీసర్లు ట్రై చేసినా చెంచులు ప్రతిఘటించడంతో విరమించుకున్నారు. తాజాగా అమ్రాబాద్​మండలంలోని కొల్లం పెంటను ఖాళీ చేయించేందుకు పైలెట్​ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇక్కడ ఉంటున్న 11 చెంచు కుటుంబాలకు ప్యాకేజీ అందజేసి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఫారెస్ట్​ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు ఎంపిక చేసిన చెంచుపెంటల్లో ఫారెస్ట్​ఆఫీసర్లు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ వారంలో దాదాపు నాలుగు చెంచు పెంటల్లో మీటింగులు పెట్టారు. కానీ చెంచులు మాత్రం ఫారెస్ట్​ఆఫీసర్ల  ప్రపోజల్స్​కు ససేమిరా అంటున్నారు. ప్యాకేజీకి ఒప్పుకున్న కుటుంబాలు కూడా తమకు ఎక్కడో దూరంగా కాకుండా అడవికి దగ్గర్లోని బఫర్​జోన్​లో పునరావాసం కల్పించాలని పట్టుబడుతున్నారు. 

125 గ్రామాలు.. 3,300 కుటుంబాలు
నాగర్​కర్నూల్​జిల్లా ఐటీడీఏ పరిధిలో 8 మండలాలు,48 గ్రామ పంచాయతీలు,125 గ్రామాల్లో 3,300 చెంచు కుటుంబాలు జీవిస్తున్నాయి. మారిన జీవన పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమైన వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ వదిలి క్రమంగా కూలి పనులకు వెళ్తున్నారు. ఫారెస్ట్​డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో చేపట్టే చెక్​డ్యాంలు, ట్రెంచింగ్​పనులు, అడవి జంతువులకు తాగునీరు అందించే సాసర్ల నిర్మాణాల్లో కూలీలుగా పని చేస్తున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆఫీసర్లు పులులు తిరిగే కోర్​ ఏరియాలోని కొల్లంపెంట, కొమ్మన్నపెంట, కుడిచింతల బైలు, ఫర్హాబాద్, మల్లాపూర్, రాయలేటి పెంట, వటవర్లపల్లి(సార్లపల్లి), గీశగండి, బాపన్​పాడు, పల్లార్​పెంటలపై దృష్టి పెట్టారు. ముందుగా కొల్లంపెంటను ఖాళీ చేయించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చెంచులు, గిరిజనేతరులు ఉంటున్న పెంటలను వదిలిపెట్టి పోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తే తప్ప తాము బలవంతంగా పంపించే ప్రయత్నాలు చేయబోమని ఫారెస్ట్​ఆఫీసర్లు అంటున్నారు. పెంటల్లో అవగాహన సమావేశాలు పెట్టి ప్రభుత్వ లక్ష్యాన్ని వివరిస్తున్నామని చెబుతున్నారు. 

అడవి చుట్టుపక్కలే పునరావాసానికి డిమాండ్​
కొల్లంపెంటకు చెందిన 11 కుటుంబాలు స్వచ్ఛందంగా అడవి బయటకు వెళ్లేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక్కడ 18 ఏండ్లు నిండిన ప్రతి అమ్మాయి, అబ్బాయిని ఒక కుటుంబంగా పరిగణిస్తారు.  ఇలా ఒక ఫ్యామిలీకి రూ.15 లక్షల పరిహారం ఇవ్వనున్నారు. చెంచులు ఒప్పుకుంటే ఆ డబ్బులతో రెండెకరాల భూమి కొనిచ్చే అవకాశం ఉంది.  చెంచులు మాత్రం అటవీ ప్రాంతమైన మాచారంలో పునరావాసం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆఫీసర్లు మాత్రం మైదాన ప్రాంతాలకు వెళ్లేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పెద్దకొత్తపల్లి మండలంలో భూములు పరిశీలించారు. అక్కడికి వెళ్లేందుకు చెంచులు సుముఖంగా లేకపోవడంతో ఆ ప్రపోజల్​విరమించుకున్నారు.  కొల్లంపెంట చెంచుల తరలింపు ప్రక్రియ స్టార్ట్​కాగానే సార్లపల్లి, కుడి చింతల బైలు, ఫర్హా బాద్ పెంటల నుంచి చెంచులను తరలించే అవకాశాలున్నాయి. ప్రకాశం, కర్నూల్, గుంటూరు జిల్లాల నుంచి వలస వచ్చి స్థానిక పెంటల్లో స్థిరపడినవారు బయటకు వెళ్లేందుకు సుముఖంగా ఉండగా ఏండ్ల తరబడి ఇక్కడే ఉన్నవారు మాత్రం తాము కదిలేది లేదని తెగేసి చెప్తున్నారు. స్థానికేతర చెంచుల్లో  కొందరు లింగాల మండలం అప్పాయిపల్లి, మరికొందరు మన్ననూర్, మాచారం వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. 

యురేనియం కోసమేనా?
నల్లమల అభయారణ్యంలో పులుల సంచారం వల్ల మనుషుల ప్రాణాలకు హాని కలగకూడదని చెంచుపెంటలను తరలిస్తున్నట్లు చెబుతున్నా వెనక వేరే లక్ష్యాలు ఉన్నట్లు చెంచు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాయలగండి వద్ద కేంద్ర ప్రభుత్వ వాహనాల కదలికలు, యురేనియం నిక్షేపాల సేకరణ వంటి అంశాలపై ఆందోళన చెందుతున్నారు. యురేనియం నిక్షేపాల వెలికితీతను తాము అడ్డుకుంటామనే అనుమానంతో పులులను సాకుగా చూపి తమను అడవికి దూరంగా తరిమేయాలన్న ప్రయత్నాలు మళ్లీ మొదలు పెట్టారని ఆరోపిస్తున్నారు.