కిడ్నీ రాకెట్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్

కిడ్నీ రాకెట్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
  • డాక్టర్ రాజశేఖర్​ను చెన్నైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అలకనంద కిడ్నీ ట్రాన్స్​ప్లాంటేషన్ దందాలో నిందితుడు
  • కోర్టులో హాజరుపర్చి రిమాండ్​కు తరలించిన సరూర్​నగర్ పోలీసులు

దిల్ సుఖ్ నగర్, వెలుగు: అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో కీలక సూత్రధారి, ప్రధాన నిందితుడు డాక్టర్ రాజశేఖర్ పెరుమళ్లను హైదరాబాద్ సరూర్​నగర్ పోలీసులు ఆదివారం రాత్రి చెన్నైలో అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు సరూర్​నగర్ ఇన్​స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని, వాళ్ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఈ కేసులో డాక్టర్ రాజశేఖర్ ఏ13గా ఉన్నట్లు వివరించారు. ‘‘సరూర్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న అలకనంద హాస్పిటల్ లో అక్రమ కిడ్నీ మార్పిడి దందా వెలుగు చూసింది. డాక్టర్ రాజశేఖర్​ను చెన్నైలో అరెస్ట్ చేసి రిమాండ్ పంపినం. అతనిది నెల్లూరు జిల్లాలోని మిలటరీ కాలనీ స్వగ్రామం. ఇప్పుడు చెన్నై పెరుంబాలంలోని బొలినేని హిల్స్​లో నివాసం ఉంటున్నాడు. అలకనంద హాస్పిటల్​లో జరిగిన 20కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లలో డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్ర పోషించాడు. 

ఇప్పటికే అతనిపై విజయవాడ, వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్ లో కేసులు నమోదయ్యాయి. పదేండ్లలో 150కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు గుర్తించినం. హైదరాబాద్ కేంద్రంగానే 80కి పైగా ఆపరేషన్లు చేశాడు. 2023 వైజాగ్ లో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ దందాలో రాజశేఖర్ పాత్ర ఉన్నట్లు తేలింది’’అని ఇన్​స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపారు. డాక్టర్ రాజశేఖర్.. మల్టీ ఆర్గాన్ ట్రాన్స్​ప్లాంట్ స్పెషలిస్ట్ అని చెప్పారు. హైదరాబాద్​లోని పలు హాస్పిటళ్లలోనూ ఇతను పని చేశాడు. ఎంతో అనుభవం ఉండటంతో విదేశాల్లోనూ ట్రాన్స్​ప్లాంటేషన్లు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
 
మొత్తం 15 మంది నిందితులు

అలకనంద హాస్పిటల్ కిడ్నీ మార్పిడి కేసు దర్యాప్తును రాచకొండ పోలీసులు స్పీడప్ చేశారు. మొత్తం 15 మందిని నిందితులుగా గుర్తించారు. ఇప్పటిదాకా డాక్టర్ రాజశేఖర్​ సహా 10 మందిని అరెస్ట్ చేశారు. డాక్టర్ షోహిబ్, తమిళనాడు, జమ్మూకాశ్మీర్​కు చెందిన డాక్టర్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఫోన్​కాల్స్ ఆధారంగా త్వరలోనే అందరినీ అరెస్ట్ చేస్తామని సరూర్ నగర్ పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టులో పిటిషన్ వేశారు.