దగ్గరుండి కటింగ్ చేయించిన తల్లి.. ఉరేసుకున్న కొడుకు

పొడవాటి హెయిర్ స్టైల్ కోసం తల్లితో పోట్లాడి.. ప్రాణాలు వదిలేశాడు ఓ టీనేజర్. జుట్టు విపరీతంగా పెంచుకున్నాడని తిట్టి.. దగ్గరుండి మరీ క్రాప్ చేయించింది తల్లి. దీంతో తన పొడుగు జుట్టు కోల్పోయానని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చెన్నై సిటీలో జరిగింది.

చెన్నై సిటీలోని కుండ్రాతుర్ ప్రాంతానికి చెందిన మోహన అనే మహిళ సినిమా ఇండస్ట్రీ హెల్పింగ్ స్టాఫ్ లో పని చేస్తోంది. హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న ఆమె కొడుకు పొంగల్ సెలవులకు ఇంటికి వచ్చాడు. అతడు జుట్టు బాగా పొడుగ్గా పెంచుకుని ఉండడంతో పొట్టిగా క్రాప్ చేయించుకోవాలంటూ ఆమె రోజూ తిడుతుండేది. అయినా ఆ కుర్రాడు లాంగ్ హెయిర్ స్టైల్ అని చెబుతూ వచ్చేవాడు. అయితే తల్లి ఎంతగా తిడుతున్నా కొడుకు వినకపోవడంతో ఆదివారం ఉదయం ఆమె దగ్గరుండి బార్బర్ షాప్ కు తీసుకెళ్లి పొట్టిగా క్రాప్ కొట్టించింది. ఆ తర్వాత ఆమె తన డ్యూటీకి వెళ్లిపోయింది. రాత్రి తిరిగి ఇంటికి వచ్చి తలుపు తెరిచిన ఆమెకు గుండెలాగినంత పనైంది. కొడుకు సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని బలన్మరణానికి పాల్పడి ఉండడం చూసి భోరున విలపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.