
చెన్నై: మార్చి నుంచి ఎండకాలం మొదలైంది. మార్చి నెలలో ఓ మోస్తారుగానే భానుడు ప్రతాపం చూపించినప్పటికీ.. ఏప్రిల్‌లో మొదట్లోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నెలలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. భానుడి భగభగలకు జనం బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. మరీ ఈ ఎండా కాలంలో ఫుడ్ డెలివరీ బాయ్స్, ఈ కామర్స్ డెలివరీ బాయ్స్, ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉండాలి. జీవనోపాధిలో భాగంగా లేచినప్పటీ నుంచి రోడ్ల మీదే తిరిగి వీరి కష్టాలు సమ్మర్లో వర్ణాతీతం.
సరే ఎండలకు భయపడి పని చేయడం మానేదామ్మా అంటే ఇళ్లు, ఫ్యామిలీ, పిల్లల పోషణ ఇవన్నీ గుర్తుకు వచ్చి ఎండలు మండిపోయిన సరే జాబ్ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో డెలివరీ బాయ్స్‌కు చెన్నై కార్పొరేషన్ మండే ఎండల్లో చల్లని కబురు చెప్పింది. సమ్మర్లో డెలివరీ బాయ్స్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని వారి కోసం నగరంలోని ప్రధాన రహదారులపై ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి ప్రాంతాలను నిర్మించాలని చెన్నై మెట్రోపాలిటన్ కార్పొరేషన్ యోచిస్తోంది.
దుబాయ్‌లో మాదిరిగా.. ఫుడ్, ఈ కామర్స్ డెలివరీ బాయ్స్ కోసం రోడ్లపై ఏసీ గదులను నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది. దీనిపై చెన్నై మెట్రోపాలిటన్ కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నగరంలోని అన్నానగర్, నుంగంబాక్కం, రాయపేట, మైలాపూర్, తింగార్ వంటి పరిసరాల్లో రెస్ట్ రూములు నిర్మిస్తామని తెలిపారు. చెన్నై కార్పొరేషన్ ఇంజనీర్లు టాయిలెట్లు, సీటింగ్, పార్కింగ్ స్థలాలతో సహా గిగ్ కార్మికుల అవసరాలపై దృష్టి సారించే డిజైన్‌పై పని చేస్తున్నారని పేర్కొన్నారు.
కాగా, ఈ ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి ప్రాంతాలు గిగ్ కార్మికులకు ఎంతగానో ఉపయోగపడతాయి. మండి ఎండల్లో తిరిగి ఈ ఏసీ రూముల్లోకి వచ్చి కూల్ అవ్వొచ్చు. కార్మికులు తమ మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసుకోవడానికి, వాటిని భద్రపరుచుకోవడానికి కూడా అధికారులు ఏర్పా్ట్లు చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో విశ్రాంతి ప్రాంతాల ఏర్పాటుకు స్థలం కనుగొనడం అధికారులకు సవాల్‌గా మారింది.