బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో తీర ప్రాంతమైన తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.చెన్నైతో పాటు దాని పరిసర జిల్లాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. జనజీవనం స్థంభించిపోయింది. పలు ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
చెన్నైలోని సత్యభామ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం పూర్తిగా జలమయమయ్యింది. స్టూడెంట్లు తమ వస్తువులను తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ల్లో కనిపిస్తున్నాయి. బెడ్లపై తమ బ్యాగులను ఉంచి కాలేజీ క్యాంపస్ నుంచి బయటికి తీసుకెళ్తున్నారు.
మరోవైపు అల్పపీడనం తీరం చేరుకోవడంతో చెన్నై నగరానికి హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బుధవారం ( అక్టోబర్ 16) న తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్ష సూచన కారణంగా ప్రైవేట్ ఐటీ కంపెనీలు అక్టోంబర్ 18 వరకు ఇంటి నుంచి పనిచేయాలని ఉద్యోగులకు సూచించాలని సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు
Also Read :- కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాల నీటి వాటా ఎంత.?
అక్టోబర్ 15 అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్నైలోని చాలా ప్రాంతాల్లో 10 సెం.మీ కంటే ఎక్కవ వర్షపాతం నమోదు అయింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్ళలోకి చేరింది. చెన్నై మెట్రో పనుల్లో డ్రైనేజీ మూసుకుపోయవడంతో కొన్ని ప్రాంతాల్లో వరదలకు గురయ్యాయి. నగరంలోని చాలా జంక్షన్లను వరద నీరు చుట్టుముట్టింది.
బుధవారం ఉదయం 10 గంటలకు తిరువాన్మియూర్‌లోని వాల్మీకి నగర్, ఏజీఎస్ కాలనీ, కామరాజర్ నగర్, అడయార్‌లోని శాస్త్రి నగర్, నేతాజీ కాలనీ, రామ్ నగర్, వేలచ్చేరి బాలకృష్ణ నగర్, పెరంబూర్‌లోని పాడీ ఫీల్డ్ రోడ్, వెంకట్రామన్ వీధి, అన్నా వీధిలోని గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లలోకి నీరు చేరింది.
ఉత్తర చెన్నైలోని పెరంబూర్, వైఎస్సార్పాడి, పట్టాళం ప్రాంతాలు మంగళవారం నుంచి ఇంకా నీటిలో మునిగి ఉన్నాయి. వైఎస్సార్‌పాడిలోని గణేశపురం సబ్‌వేలో 3 అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్నింటిని రద్దు చేయగా..మరికొన్నింటిని వాయిదా వేశారు.చెన్నైలు సెంట్రల్ నుంచి బయలుదేరాల్సిన ఐదు రైళ్లు రద్దు చేశారు. సప్తగిరి, ఏర్కాడ్, కావేరీ, బోడినాయకరూర్ సూపర్ ఫాస్ట్ తిరుపతి ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేయబడ్డాయి.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతంలో గంటకు 12 కి.మీల వేగంలో పశ్చిమ - వాయువ్య దిశగా పయనించి చెన్నై కు తూర్పు - ఆగ్నేయంగా 360 కిమీల దూరంలో పుదుచ్చేరికి 390 కిమీల దూరంలో నెల్లూరుకు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అక్టోబర్ 17తెల్లవారు జామున చెన్నైకి దగ్గరగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను, పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.