హైదరాబాద్: తెలుగు మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరి అరెస్ట్ అయింది. ఆమెను హైదరాబాద్లోని గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు ప్రజలపై మరీ ముఖ్యంగా తెలుగు మహిళలపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం ఆమె నవంబర్ 14న మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలకు పూర్తి స్థాయి ఆధారాలు ఉండటంతో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో తెలుగు ప్రజలకు కస్తూరి క్షమాపణలు కూడా చెప్పింది. నవంబర్ 3న చెన్నైలోని బ్రాహ్మణ సమాజ సమ్మేళనం కార్యక్రమంలో కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
— Vignesh Anand (@VigneshAnand_Vm) November 4, 2024
తమిళనాడులో ఉంటున్న తెలుగు ప్రజలు 300 ఏళ్ల క్రితం తమిళ రాజుల భార్యలకు సేవలు చేయడానికి వచ్చారని.. కానీ ఇప్పుడు ఆ తెలుగోళ్లే తమిళ వాళ్లమని చెప్పుకుంటూ చలామణీ అవుతున్నారని కస్తూరి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా కస్తూరి వ్యాఖ్యలపై భగ్గుమన్నాయి.
ఈ వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడులో ఆమెపై కేసు నమోదైంది. అరెస్ట్ భయంతో ఇన్ని రోజులుగా కస్తూరి పరారీలో ఉంది. కస్తూరి ఆచూకీ తెలుసుకుని, ఆమెను అరెస్ట్ చేసేందుకు గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ ఒక స్పెషల్ టీంను హైదరాబాద్కు పంపింది. చెన్నై పోలీసులు ఎట్టకేలకు ఆమెను శనివారం(నవంబర్ 16, 2024) గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. చెన్నైకి తరలించారు. నెక్ట్స్ జరగబోయేదేంటంటే.. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించే అవకాశం ఉంది.