ChennaiRains : అపార్ట్ మెంట్ 4వ అంతస్తులోకి బైక్స్,.. ఇళ్లల్లో బండ్లు

ChennaiRains : అపార్ట్ మెంట్ 4వ అంతస్తులోకి బైక్స్,.. ఇళ్లల్లో బండ్లు

చెన్నై సిటీ.. ఇప్పుడు జల విలయంతో విలవిలలాడుతోంది. ఇదే సమయంలో తమ తమ వాహనాలను కాపాడుకోవటానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఓనర్లు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోని జనం.. ఇప్పటికే చెన్నై సిటీలోని అన్ని ఫ్లై ఓవర్లపై కార్లకు పార్క్ చేశారు. మరికొందరు అయితే ఎత్తయిన ప్రాంతాల్లోని తమ బంధువులు, ఫ్రెండ్స్ ఇళ్ల దగ్గర వాహనాలను పార్క్ చేస్తున్నారు. ఇంతటితో ఆగితే పర్వాలేదు.. ఇప్పుడు మరో ఊహించని.. షాకింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

చెన్నై సిటీలోని వెలచ్చేరి, కోయంబేడు, గిండి, మడిపాక్కం వంటి ప్రాంతాల్లోకి వరద హెచ్చరికలు ఉన్నాయి. గతంలోనూ ఈ ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే.. ఈసారి కూడా ఆయా ప్రాంతాల్లోని భారీ అపార్ట్ మెంట్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్స్ వాళ్లు అప్రమత్తం అయ్యారు. తమ తమ బైక్స్ ను అపార్ట్ మెంట్ లిఫ్టుల ద్వారా నాలుగు, ఐదు అంతస్తులకు తరలించారు. తమ ఫ్లాట్స్ కారిడార్ లో వాటిని పార్క్ చేస్తున్నారు.  వేలచ్చేరిలోని ఓ అపార్ట్ మెంట్4వ అంతస్తులోని కారిడార్ లో పార్క్ చేసిన బైక్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read:-ఇంజినీరింగ్ కాలేజీలను ముంచెత్తిన వరద

మరో ఏరియా మడిపాక్కంలో అయితే కొందరు తమ వాహనాలను ఇంట్లోని హాల్ లోకి పార్క్ చేశారు. పార్కింగ్ ఏరియాలోకి నీళ్లు వస్తుండటంతో.. ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నారు. చుట్టుపక్కల ఉన్న బైక్ ఓనర్లు అందరూ కలిసి.. అన్ని వాహనాలను ఓ ఇంట్లో పార్క్ చేసిన ఫొటో వైరల్ అయ్యింది. గతంలో వచ్చిన వర్షాలు, వరదలతో తమ వాహనాలు పాడయిపోయాయని.. వాటి రిపేర్లకు చాలా ఖర్చయ్యిందని.. ఈసారి ముందు జాగ్రత్తగా అందరం కలిసి ఇలా చేస్తున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు ఓనర్లు. 

మొత్తానికి చెన్నై జల విజయం.. కొత్త కొత్త ఐడియాలను సృష్టిస్తుంది. రాబోయే మూడు, నాలుగు రోజులు భారీ వర్షాల హెచ్చరికలతో ఇంకెన్ని కొత్త ఐడియాలు బయటకు వస్తాయో చూడాలి..