చెన్నై: ‘మత్తు వదలరా’ సినిమా ఫస్ట్ పార్ట్ చూసే ఉంటారు. ఆ సినిమాలో రెండో కంటికి తెలియకుండా ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ రెంట్కు తీసుకుని ఆ ఫ్లాట్లో ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకుని.. డ్రగ్స్ తయారుచేసి వెన్నెల కిషోర్ క్యారెక్టర్ మైరాకు సప్లై చేస్తుంటాడు. చెన్నైలో కాలేజ్ స్టూడెంట్స్ గ్యాంగ్ సేమ్ ఇదే పని చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. చెన్నైలో అక్టోబర్ 23, 2024న ఏడుగురు స్టూడెంట్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మెథాంఫేటమిన్ ఫార్ములా డ్రగ్ను తయారుచేసి విక్రయించేందుకు కొడంగ్యూర్లో ఈ బ్యా్చ్ ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఈ గ్యాంగ్లో ఒక ఎం.ఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్ కూడా ఉన్నాడు. ఈ కెమిస్ట్రీ స్టూడెంట్ను డ్రగ్ తయారుచేసినందుకు ఇంత ఇస్తామని మాట్లాడుకుని గ్యాంగ్లో చేర్చుకున్నారు. నలుగురు రోబోటిక్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ గ్యాంగ్కు ఒక పెద్ద డ్రగ్ సిండికేట్తో సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇళ్లలో అకడమిక్ రీసెర్చ్ అని చెప్పి అద్దె ఇంట్లో డ్రగ్స్ తయారుచేసే పనిలో ఈ బ్యాచ్ తలమునకై ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫ్రాన్సిస్ (21), నవీన్ (22), ప్రవీణ్ ప్రణవ్ (21), కిషోర్ (21), జ్ఞానపాండ్యన్ (22), అరుణ్ కుమార్ (22), ధనుష్ (23)ను పోలీసులు అరెస్ట్ చేశారు. 250 గ్రాముల డ్రగ్స్ను తమిళనాడు పోలీస్ యాంటీ డ్రగ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ADIU) సీజ్ చేసింది. కెమికల్ వేయింగ్ మెషీన్, టెస్ట్ ట్యూబ్స్, రా కెమికల్స్, గ్లాస్ జార్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్లో జ్ఞానపాండ్యన్కు కెమిస్ట్రీ పట్ల అవగాహన ఉండటంతో లోకల్ ఫార్మాస్యూటికల్ కంపెనీల నుంచి, ఆన్లైన్ నుంచి కెమికల్స్ తెప్పించుకుని ల్యాబ్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈజీ మనీ కోసం యూత్ ఇలా డ్రగ్స్ దందాలోకి దిగడం ఆందోళన కలిగించే విషయం.
మెథాంఫేటమిన్ తయారుచేసి విక్రయించి ఓవర్ నైట్లో లక్షాధికారులు కావాలనే దురాశ ఈ స్టూడెంట్స్ను కటకటాలపాలు చేసింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ గ్యాంగ్లోని కెమిస్ట్రీ స్టూడెంట్ బ్యాచిలర్ సైన్స్ కోర్స్లో గోల్డ్ మెడలిస్ట్ కావడం గమనార్హం. ఇటీవలే తమిళనాడులోని చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మెథాంఫెటమైన్ తయారీలో ఉపయోగించే 110 కిలోల ఎఫిడ్రన్ డ్రగ్స్ను చెన్నై పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు వెళ్లి కార్గో షిప్ నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాకు ప్రయత్నంచినందుకు చెన్నైకి చెందిన ఇద్దరు కార్గో షిఫ్ ఏజెంట్లు అబుతాహిర్(30), అహ్మద్ భాషా (35) లను అరెస్ట్ చేశారు. ఇందులో అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్ ప్రమేయం ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.